Thursday, October 1, 2026

Three Wheel Scooters: 1000 మందికి మూడు చక్రాల స్కూటీలు.. అర్హులు వీరే..

Three Wheel Scooters: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు మూడు చక్రాల స్కూటీలను అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

శారీరక వైకల్యం కారణంగా పదో తరగతి తర్వాత చాలామంది ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారు. కొందరు ఇంటర్‌లో ప్రవేశం పొందుతున్నప్పటికీ.. ప్రతిరోజూ కళాశాలకు వెళ్లి రావడం వారికి పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కళాశాలలు ఇంటికి దూరంగా ఉండటం కూడా కొంతమంది విద్యార్థులకు చదువు కొనసాగించడంలో అడ్డంకిగా మారుతోంది.

డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ – insightearth.in – Telugu News Portal

ఈ నేపథ్యంలో దివ్యాంగ విద్యార్థుల రాకపోకలను సులభతరం చేయడంతో పాటు వారు చదువును నిరంతరంగా కొనసాగించేలా ప్రోత్సహించేందుకు స్కూటీలను అందించాలని ఇంటర్‌ విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులకు సొంతంగా రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తే కళాశాలకు వెళ్లడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో మధ్యలో చదువు మానేసే పరిస్థితి కూడా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

రూ.10 కోట్ల నిధులు కేటాయింపు

ఇందులో భాగంగా 2026–27 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 1,000 మంది విద్యార్థులకు వాహనాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ఎంపికైన దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన వాహనాలను అందించనున్నారు.

దసరా నుంచి కొత్త పింఛన్లు? – insightearth.in – Telugu News Portal

ఎలాంటి వాహనాలు ఇస్తారు?

విద్యార్థులకు సాధారణ ద్విచక్ర వాహనాలను కాకుండా రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్‌ను అందించనున్నారు. దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ వాహనాలు వారి రాకపోకలకు ఉపయోగపడేలా ఉంటాయి. ముఖ్యంగా పెట్రోల్‌తో పాటు విద్యుత్తుతో కూడా నడిచే విధంగా వీటిని అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

త్వరలో దరఖాస్తుల స్వీకరణ

స్కూటీల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను మరో నెల రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి మార్గదర్శకాలను విడుదల చేయనుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి, ఏయే ధ్రువపత్రాలు సమర్పించాలి, వాహనాల పంపిణీకి సంబంధించిన ఇతర నిబంధనలు ఏమిటనే విషయాలను అధికారిక మార్గదర్శకాల్లో స్పష్టం చేయనున్నారు.

జిల్లా స్థాయిలో దరఖాస్తుల పరిశీలన

విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం వాటిని జిల్లా స్థాయి పరిశీలన కమిటీ పరిశీలించనుంది. దరఖాస్తుదారుల అర్హత, వైకల్యానికి సంబంధించిన వివరాలు, విద్యాభ్యాసం తదితర అంశాలను పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

1000 మందికి మించి దరఖాస్తులు వస్తే..

ఈ పథకం కింద 1000 మంది విద్యార్థులకు మాత్రమే స్కూటీలు అందించనున్నారు. అయితే నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే.. వైకల్యం తీవ్రతను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించనున్నారు. ఈ ప్రక్రియలో దివ్యాంగుల సంక్షేమ శాఖ సహకారాన్ని కూడా తీసుకోనున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News