Thursday, October 1, 2026

Cm RevanthReddy In Knr: పేదలకు నమ్మకం కలిగించేలా కలెక్టరేట్‌ పనిచేయాలి : కరీంనగర్ లో సీఎం రేవంత్‌రెడ్డి

Cm RevanthReddy In Knr:కరీంనగర్‌: కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ భవనం పేదలకు నమ్మకం కలిగించే కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పేదల సమస్యల చిక్కుముడులను విప్పేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడాలని సూచించారు. నూతన కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఉద్యోగుల సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు తదితర అంశాలపై సీఎం మాట్లాడారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులే కీలక ప్రతినిధులని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సహాయం కోసం నిస్సహాయంగా కార్యాలయాలకు వచ్చే ప్రజల్లో తమ కుటుంబ సభ్యులను చూడాలని ఉద్యోగులకు సూచించారు. అలా పనిచేసినప్పుడే ప్రజలకు నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందని అన్నారు.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్‌ కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని పూర్తి చేశామని సీఎం తెలిపారు. ప్రజలకు సేవలు అందించే ఉద్యోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే భవన సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. ఉద్యోగుల సమస్యలను ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజలకు సేవలు అందిస్తూనే వారి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ఉద్యోగులు కష్టపడి పనిచేసినప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడేలా అధికారులు పనిచేయాలని సూచించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, ప్రధానమంత్రికైనా మంచి పేరు రావాలంటే ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజలకు నేరుగా సేవలు అందించే ఉద్యోగులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మించినా, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు రాకపోతే వాటి ప్రయోజనం ప్రజలకు అందదని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలవాల్సి ఉంటుందని చెప్పారు. తమ పర్యటనలను కొందరు లెక్కలేస్తున్నారని వ్యాఖ్యానించిన సీఎం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైన చోట కేంద్రంతో సమన్వయం చేసుకుంటామని స్పష్టం చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు నెలల వ్యవధిలోనే 170 ఎకరాల రక్షణ భూములను రాష్ట్ర అభివృద్ధి అవసరాల కోసం బదలాయించేలా చర్యలు తీసుకున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. అలాగే బేగంపేట రన్‌వే కింద నుంచి రోడ్డు నిర్మాణానికి అవసరమైన అనుమతులు కూడా సాధించామని చెప్పారు.

రాజకీయ సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతుల కోసం కేంద్రాన్ని కలవడంలో ఎలాంటి సంకోచం లేదని పేర్కొన్నారు.

కరీంనగర్‌ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై మరోసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News