Thursday, October 1, 2026

Death Certificate New Rules 2026: అక్టోబర్ 1 నుంచి డెత్ సర్టిఫికెట్ కొత్త నిబంధనలు.. ఆలస్యమైతే ఏం చేయాలంటే?

Death Certificate New Rules 2026: మరణం ప్రతి కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చే ఘటన. అయితే ఆ విషాదం నుంచి తేరుకునేలోపే మరణ నమోదు ప్రక్రియను పూర్తి చేయకపోతే.. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అధికారిక ప్రక్రియలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. డెత్ సర్టిఫికెట్ విషయంలో ఆలస్యంగా నమోదు చేసే ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే?

రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (అమెండ్‌మెంట్) యాక్ట్ ప్రకారం..దేశంలో జనన, మరణాల నమోదు తప్పనిసరి. సాధారణంగా మరణం సంభవించిన తర్వాత నిర్దేశిత వ్యవధిలోనే సంబంధిత రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి. ఆలస్యమైతే నిర్ణీత ఆలస్య రుసుముతో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. 30 రోజుల తర్వాత కానీ ఏడాది లోపు సమాచారం ఇస్తే, సంబంధిత అధికారుల అనుమతి, నిర్దేశిత పత్రాలు మరియు ఫీజుతో నమోదు ప్రక్రియ కొనసాగుతుంది.

ఏడాది దాటితే..

మరణం సంభవించిన తేదీ నుంచి ఒక సంవత్సరం దాటినా, రెండు సంవత్సరాల లోపు మరణాన్ని నమోదు చేయకపోతే ఇక సాధారణంగా రిజిస్ట్రార్ వద్ద దరఖాస్తు చేసుకోవడం మాత్రమే సరిపోదు. కొత్త చట్టం ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్ (DM), సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) లేదా జిల్లా మేజిస్ట్రేట్ అధికారం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నుంచి ఉత్తర్వు పొందాల్సి ఉంటుంది. మరణం నిజంగా సంభవించిందా? దానికి సంబంధించిన ఆధారాలు సరైనవేనా? అనే విషయాలను పరిశీలించిన తర్వాతే ఆలస్య నమోదుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

Apple Pay India Launch 2026: అక్టోబర్‌లో Apple Pay.. Axis Bank క్రెడిట్ కార్డులతో ప్రారంభం – insightearth.in – Telugu News Portal

రెండేళ్లు దాటితే కోర్టు ఆదేశం తప్పనిసరి

మరణ నమోదు రెండేళ్లకు మించి ఆలస్యం అయితే ప్రక్రియ మరింత కఠినంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నుంచి ఉత్తర్వు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఉత్తర్వు ఆధారంగానే సంబంధిత రిజిస్ట్రార్ మరణాన్ని నమోదు చేస్తారు. ఆలస్య నమోదుకు ముందు మరణానికి సంబంధించిన వివరాల ప్రామాణికతను ధృవీకరించడం కూడా కొత్త నిబంధనల్లో కీలకంగా ఉంది.

ఎందుకు ఈ మార్పులు?

మరణాల నమోదు ఆలస్యమైతే ప్రభుత్వ జనాభా, పౌర రికార్డులపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో తప్పుడు లేదా అనుమానాస్పద వివరాలతో రికార్డులు సృష్టించకుండా చూడటం కూడా అవసరం. అందుకే ఎక్కువ కాలం ఆలస్యమైన మరణ నమోదులకు అదనపు ధృవీకరణ, అధికారి లేదా న్యాయస్థానం ఉత్తర్వును తప్పనిసరి చేసే విధంగా చట్టంలో మార్పులు చేశారు. కేంద్ర ప్రభుత్వ Civil Registration System ప్రకారం జనన, మరణాల నమోదు దేశంలో తప్పనిసరి వ్యవస్థగా కొనసాగుతోంది.

డెత్ సర్టిఫికెట్ ఎందుకు?

డెత్ సర్టిఫికెట్ ఒక వ్యక్తి మరణించిన విషయాన్ని అధికారికంగా నిర్ధారించే కీలక ప్రభుత్వ పత్రం. కుటుంబ ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, బీమా, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డీమ్యాట్ ఖాతాలు తదితర ఆర్థిక మరియు చట్టపరమైన వ్యవహారాల్లో ఇది అవసరం కావచ్చు. మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆస్తులు లేదా పెట్టుబడులను వారసుల పేర్లకు బదిలీ చేసే సమయంలో కూడా మరణ ధ్రువీకరణ పత్రం కీలక ఆధారంగా ఉపయోగపడుతుంది.

బీమా క్లెయిమ్‌కు కూడా..

ఎవరైనా జీవిత బీమా పాలసీ తీసుకుని మరణించినట్లయితే, నామినీ లేదా చట్టబద్ధ వారసులు క్లెయిమ్ చేసేటప్పుడు డెత్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పాలసీ నిబంధనల ప్రకారం మరికొన్ని పత్రాలు కూడా కోరవచ్చు. అందువల్ల మరణం జరిగిన వెంటనే అధికారిక నమోదు పూర్తి చేసుకోవడం కుటుంబ సభ్యులకు తర్వాతి దశలో ఉపయోగకరంగా ఉంటుంది.

ఎక్కడ నమోదు చేసుకోవాలి?

మరణం జరిగిన ప్రాంతాన్ని బట్టి సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ పరిధిలోని రిజిస్ట్రార్ వద్ద మరణ నమోదు జరుగుతుంది. తెలంగాణలో ఆలస్యమైన మరణ నమోదుకు ప్రత్యేక సేవ కూడా అందుబాటులో ఉంది. ప్రభుత్వ సేవల పోర్టల్ ప్రకారం ఒక సంవత్సరం తర్వాత కూడా మరణాన్ని నమోదు చేసుకునేందుకు ‘Late Registration of Death’ సేవ ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News