Apple Pay India Launch 2026: ఇప్పటి వరకు ఫోన్ పే, జీ పే, అమెజాన్ పే చూశాం.. ఇక ఇప్పటి నుంచి Apple Pay కూడా చూడబోతున్నాం. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐఫోన్ వినియోగదారులకు త్వరలో దీనిపై గుడ్‌న్యూస్ అందే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే యాపిల్ పే సేవలు వచ్చే నెలలో అంటే అక్టోబర్ 2026లో భారత్‌లో ప్రారంభించే అవకాశముందని Reuters నివేదించింది. ఈ సేవ తొలిదశలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
భారత్‌లో Apple Pay సేవలు అక్టోబర్ లో ప్రారంభం కానున్నాయి. అయితే ముందుగా కేవలం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇతర బ్యాంకులను ఒక్కొక్కటిగా తమ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు Reuters నివేదిక పేర్కొంది. ఇతర దేశాల్లో Apple అనుసరించిన బ్యాంక్-బై-బ్యాంక్ భాగస్వామ్య నమూనానే భారత్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది.
భారత్‌లో హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్ లతో కూడా ఆపిల్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే వాణిజ్య నిబంధనలపై ఇరు పక్షాల మధ్య ఇంకా తుది ఒప్పందం కుదరలేదని తెలుస్తోంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2026 జూలై నాటికి యాక్సిస్ బ్యాంక్ వద్ద సుమారు 1.626 కోట్ల యాక్టివ్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. దీంతో దేశంలో క్రెడిట్ కార్డు జారీదారుల్లో ఈ బ్యాంక్ నాలుగో స్థానంలో ఉంది. అందువల్ల యాపిల్ పే భారత్‌లోకి ప్రవేశించడానికి ఈ బ్యాంక్ భాగస్వామ్యం ఒక కీలక ప్రారంభ దశగా మారే అవకాశం ఉంది.
యాపిల్ పే ద్వారా వినియోగదారులు తమ క్రెడిట్ కార్డు వివరాలను ఐ ఫోన్ లోని యాపిల్ వాలెట్ లో భద్రపరుచుకోవచ్చు. కార్డు నంబర్‌ను ప్రతిసారి చెప్పకుండా ఒక టోకనైజ్డ్ కార్డు వివరాలతో కాంటాక్ట్‌లెస్ పేమెంట్ చేయవచ్చు. అంటే NFC ఆధారిత పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్ వద్ద ఐఫోన్ ఉంచి చెల్లింపు చేసే విధానం అన్నమాట. వినియోగదారులు ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ వంటి బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌తో లావాదేవీని ధృవీకరించవచ్చు.
ఇదిలా ఉండగా భారత్‌లో డిజిటల్ పేమేంట్ సిస్టమ్ లో యూపీఐ ఆధిపత్యంలో ఉంది. ఈ క్రమంలో తొలి దశలో ప్రధానంగా క్రెడిట్ కార్డు ఆధారిత కాంటాక్ట్‌లెస్ చెల్లింపులపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం యూపీఐ మద్దతు ప్రారంభ దశలో ఉండకపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అయితే యాపిల్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మరోవైపై ఇటీల యూపీఐ చార్జీలు పెరుగుతున్నందున దీనిని ఎలా వాడుతారో తెలియాల్సి ఉంది.
భారత్‌లో ఐ ఫోన్ లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యాపిల్ పే తీసుకువస్తే ప్రోత్సాహకంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు. 2022 నుంచి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ వాటా సుమారు 8 శాతానికి చేరింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, Apple Payకు భారత్‌లో కొత్త వినియోగదారుల ఆధారం లభించే అవకాశం ఉంది.





