Saturday, September 12, 2026

Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్ కు వెళ్లేవారికి అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్ : వినాయక చవితి వేడుకల్లో భాగంగా ప్రముఖ ఖైరతాబాద్ మహా గణేషుడి దర్శనాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో నగర ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 12 నుంచి 24వ తేదీ వరకు కఠిన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ తెలిపారు. ప్రతి ఏడాది ఖైరతాబాద్ భారీ గణపతిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఖైరతాబాద్ పరిసర ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రించనున్నారు. అవసరాన్ని బట్టి వాహనాలను దారి మళ్లించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించనున్నారు. ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నారు.

వాహనాల దారి మళ్లింపు ఇలా..

పీవీ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను నిరంకారి జంక్షన్ వైపు మళ్లించనున్నారు. పాత పీఎస్ సైఫాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను రాజ్‌దూత్ లైన్ మీదుగా ఇక్బాల్ మినార్ వైపు పంపించనున్నారు. అదేవిధంగా ఇక్బాల్ మినార్ నుంచి ఐమ్యాక్స్ వైపు వెళ్లే వాహనాలు మింట్ కాంపౌండ్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్ వైపు వెళ్లేలా పోలీసులు సూచించారు. దీంతో ఖైరతాబాద్ ప్రధాన మార్గంలో వాహనాల రద్దీని తగ్గించేలా చర్యలు చేపట్టనున్నారు.

నెక్లెస్ రోటరీ వైపు నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను సెక్రటేరియట్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నారు. అలాగే నిరంకారి నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ వైపు దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి వచ్చే భక్తులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. వాహనదారులు ముందుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడంతో పాటు ట్రాఫిక్ సిబ్బంది సూచనలకు అనుగుణంగా ప్రయాణించాలని సూచించారు. పండుగ రోజులలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున అవసరాన్ని బట్టి మరిన్ని ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News