1980 Retro: సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980s Retro AI Trend తెగ వైరల్ అవుతోంది. మన ప్రస్తుత ఫొటోను AI టూల్‌లోకి అప్‌లోడ్ చేసి.. 1980ల నాటి స్టైల్‌లోకి మార్చుకోవడం ఈ ట్రెండ్ ప్రత్యేకత. పాతకాలపు దుస్తులు, హెయిర్‌స్టైల్, వాహనాలు, ఇళ్లు, కెమెరా ఎఫెక్ట్‌లతో ఫొటోలు క్షణాల్లో సిద్ధమవుతున్నాయి. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు చాలామంది ఈ ట్రెండ్‌ను ఆస్వాదిస్తున్నారు. అయితే సరదాగా చేస్తున్న ఈ పని ద్వారా మన వ్యక్తిగత ఫొటోలు, వివరాలు తెలియకుండానే ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదెలాగంటే?
ఏం జరుగుతుంది?
ఈ ట్రెండ్ వల్ల నేరుగా మోసం జరగకపోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టెక్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చాట్ జీపీటీ ద్వారా ఈ ఫొటోలను మార్చేసుకుంటున్నారు. అయితే ఒకటి లేదా రెండ ఫొటోలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఆ తరువాత అప్ గ్రేడ్ చేసుకోవాలని అంటుంది. దీంతో కొంత మంది ఎక్కువ ఫొటోలు చేయడానికి ఆస్కారం ఉండదు. ఇదే క్రమంలో కొందరు యాప్ లను చూపిస్తూ అన్ లిమిటెడ్ అనే ఆఫర్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా హై-క్వాలిటీ ముఖ చిత్రాలను అందిస్తామని కొన్ని నకిలీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి నకిలీ యాప్ వలలో చిక్కుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా CERT-In అనే సంస్థ AI ఆధారిత మోసాల్లో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఫిషింగ్, ఇంపర్సనేషన్, డీప్‌ఫేక్‌లను ఉపయోగించే ముప్పులు పెరుగుతున్నాయని హెచ్చరిస్తోంది.
ఫొటోతో ఏం చేయగలరు?
మన ముఖం స్పష్టంగా కనిపించే ఫొటో సైబర్ నేరగాళ్లకు దొరికితే దాన్ని మార్ఫింగ్ చేయడం, నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం, డీప్‌ఫేక్ ఫొటోలు లేదా వీడియోలు తయారు చేయడం వంటి దుర్వినియోగాలకు ప్రయత్నించవచ్చు. CERT-In ప్రకారం ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు డీప్‌ఫేక్‌లకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఫేక్ కంటెంట్ ద్వారా పరువు నష్టం, మోసం, బ్లాక్‌మెయిల్ వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
మరో మోసం.. నకిలీ AI యాప్‌లు
“1980 Retro Photo Maker”, “AI Vintage Photo”, “80s Photo Generator” అంటూ నకిలీ యాప్‌లు లేదా వెబ్‌సైట్లను సైబర్ నేరగాళ్లు ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఫొటో తయారు చేసేందుకు ముందుగా యాప్ డౌన్‌లోడ్ చేయాలని, అనుమతులు ఇవ్వాలని లేదా లాగిన్ వివరాలు నమోదు చేయాలని అడగవచ్చు. కొన్నిసార్లు APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయించే ప్రయత్నం కూడా జరగొచ్చు. ఇలాంటి యాప్‌ల ద్వారా ఫొటోలతో పాటు పరికరంలోని ఇతర సమాచారానికి యాక్సెస్ పొందే ప్రమాదం ఉంటుంది. అందుకే తెలియని వెబ్‌సైట్ల నుంచి యాప్‌లు లేదా ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని CERT-In సూచిస్తోంది.
ఫొటోతో పాటు వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు
AI ఫొటో తయారు చేయడానికి పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలు అవసరం లేదంటే వాటిని ఇవ్వకపోవడమే మంచిది. ముఖ్యంగా ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు వివరాలు, OTP, UPI PIN, పాస్‌వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి టూల్స్‌లో నమోదు చేయకూడదు. వ్యక్తిగత సమాచారం ఎక్కువగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించి టార్గెట్‌డ్ మోసాలు చేయడం సులభమవుతుందని సైబర్ భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
కుటుంబ ఫొటోల విషయంలో మరింత జాగ్రత్త
పిల్లలు, వృద్ధులు, కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా ఇలాంటి ట్రెండ్ కోసం విచ్చలవిడిగా అప్‌లోడ్ చేయకపోవడం మంచిది. ముఖ్యంగా పిల్లల ముఖాలు, స్కూల్ యూనిఫాం, ఇంటి వివరాలు, వాహన నంబర్లు, ప్రదేశం వంటి వివరాలు ఒకే ఫొటోలో కనిపిస్తే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫొటోను అప్‌లోడ్ చేసే ముందు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే సున్నితమైన సమాచారాన్ని తొలగించడం లేదా క్రాప్ చేయడం మంచిది.
సోషల్ మీడియా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చండి
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఖాతాల్లో ఫొటోలు ఎవరు చూడగలరో ఒకసారి పరిశీలించాలి. అవసరమైతే ఖాతాను ప్రైవేట్‌గా ఉంచడం, పాత పోస్టులను పరిమితం చేయడం, ప్రొఫైల్‌లో వ్యక్తిగత వివరాలను తగ్గించడం మంచిది. సోషల్ మీడియా ఖాతాలకు బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌తో పాటు Multi-Factor Authentication (MFA) కూడా ఆన్ చేయాలని CERT-In సూచిస్తోంది.
డబ్బులు పోయినట్లయితే వెంటనే 1930కు కాల్ చేయాలి
ఏదైనా నకిలీ AI యాప్ లేదా లింక్ ద్వారా మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా 1930 నంబర్‌కు కాల్ చేయాలి. అలాగే National Cyber Crime Reporting Portalలో ఫిర్యాదు చేయాలి. ఈ హెల్ప్‌లైన్ 24 గంటలు అందుబాటులో ఉందని ప్రభుత్వ సైబర్ క్రైమ్ పోర్టల్ పేర్కొంటోంది.
ట్రెండ్‌ను ఆస్వాదించండి.. కానీ జాగ్రత్త మరవొద్దు
1980 Retro AI Trend సరదాగా ఫొటోలు తయారు చేసుకునే ఒక వైరల్ ట్రెండ్ మాత్రమే. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఏ AI టూల్‌లో పడితే ఆ టూల్‌లో ఫొటో అప్‌లోడ్ చేయకుండా, నమ్మకమైన సేవలను మాత్రమే ఉపయోగించడం, యాప్ అనుమతులను పరిశీలించడం, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకపోవడం, సోషల్ మీడియా ప్రైవసీని బలంగా ఉంచడం చాలా ముఖ్యం. AI ఎంత వినోదాన్ని ఇస్తుందో.. అదే సమయంలో దాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలను కూడా గుర్తుంచుకుంటే సైబర్ మోసాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.





