Thursday, September 10, 2026

Telangana Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేసేవారికి గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల..

Telangana Police Jobs: తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీస్‌, అగ్నిమాపక, జైళ్ల, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ శాఖల్లోని కానిస్టేబుల్‌, సమాన స్థాయి పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏడేళ్ల సడలింపునకు అదనంగా..

ఇప్పటికే యూనిఫాం సర్వీసుల ప్రత్యక్ష నియామకాలకు ప్రభుత్వం ఏడేళ్ల వయో సడలింపు కల్పించింది. దీనికి అదనంగా కానిస్టేబుల్‌, సమాన స్థాయి పోస్టులకు మరో మూడేళ్ల వెసులుబాటు కల్పిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు వయోపరిమితి కారణంగా పోలీస్‌ ఉద్యోగాలకు దూరమైన మరికొందరు అభ్యర్థులు కూడా పోటీ పడే అవకాశం లభించనుంది.

ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల మధ్య వ్యత్యాసం తొలగింపు

హోంశాఖలోని సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై), కానిస్టేబుల్‌ పోస్టుల గరిష్ఠ వయోపరిమితుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించడమే తాజా నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు ఎస్సై పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లు కాగా.. కానిస్టేబుల్‌ పోస్టులకు 29 ఏళ్లుగా ఉంది. ఈ వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు మరో మూడేళ్ల వయో సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నాలుగు శాఖల్లో వర్తింపు

తాజా వయో సడలింపు పోలీస్‌ శాఖతో పాటు ఫైర్‌ సర్వీసెస్‌, ప్రిజన్స్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ శాఖల్లోని కానిస్టేబుల్‌, సమాన స్థాయి పోస్టులకు వర్తించనుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించే ప్రత్యక్ష నియామకాలలో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

డ్రైవర్‌ పోస్టులకు వర్తించదు

అయితే పోలీస్‌ శాఖలోని కానిస్టేబుల్‌ డ్రైవర్‌ పోస్టులకు మాత్రం తాజా మూడేళ్ల వయో సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా పోస్టులకు ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే నియామక ప్రక్రియ కొనసాగనుంది.

సీఎం దృష్టికి అభ్యర్థుల సమస్యలు

పోలీస్‌ ఉద్యోగాల అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను బుధవారం కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ బల్మూరి వెంకట్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని పెంచడంతో పాటు పోలీస్‌ నియామకాల ఫిజికల్‌ ఈవెంట్లలో లాంగ్‌జంప్‌ అర్హత ప్రమాణాలను కూడా సడలించాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం అందజేశారు.

అభ్యర్థుల్లో ఆశలు

బల్మూరి వెంకట్‌ సీఎంకు వినతిపత్రం సమర్పించిన అనంతరం ప్రభుత్వం కానిస్టేబుల్‌ స్థాయి పోస్టుల వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా నిర్ణయంతో పోలీస్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు అదనపు అవకాశం లభించనుంది. ఇక ఫిజికల్‌ ఈవెంట్లలో లాంగ్‌జంప్‌ అర్హత ప్రమాణాల సడలింపుపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్నది అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News