NH 563: ఉత్తర తెలంగాణలో కీలక రవాణా మార్గం పూర్తయింది. కరీంనగర్, వరంగల్ మధ్య జాతీయ రహదారి-563 నాలుగు వరుసల విస్తరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే కనీంస గంటన్నర సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ రహదారి గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
రూ.1,641 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ 68.015 కిలోమీటర్ల ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కరీంనగర్ వరంగల్ మధ్య ప్రయాణ సమయం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. పనులు పూర్తయ్యే ముందు భాగంగా మంగళవారం ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. మానకొండూరు బైపాస్ నుంచి ప్రారంభమయ్యే ఈ నాలుగు వరుసల రహదారి హనుమకొండ సమీపంలోని వరకు కొనసాగుతుంది. ఈ మార్గ మధ్యలో మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్‌పర్తి తదితర ప్రాంతాలను కలుపుతూ ఈ హైవే కొనసాగతుంది. గతంలో ఈ మార్గం రెండు వరుసలకే పరిమితం కావడంతో వాహనాల రద్దీ, ఓవర్‌టేకింగ్ సమస్యలు, ప్రయాణ సమయం పెరగడం వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి. నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయడంతో ఈ సమస్యలకు పరిష్కారం లభించనుంది.

అధునాతన ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ
కొత్త హైవేపై ప్రయాణికుల భద్రతకు అధునాతన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ATMS)ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున 360 డిగ్రీల కెమెరాలను అమర్చి కేంద్ర నిఘా కేంద్రం నుంచి రహదారిపై ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. ప్రమాదాలు, వాహనాలు నిలిచిపోవడం లేదా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడినప్పుడు వేరియబుల్ మెసేజ్ సైన్స్ (VMS) డిజిటల్ బోర్డుల ద్వారా వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు అందించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం 1033 హెల్ప్‌లైన్‌తోపాటు రూట్ పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్సులు, క్రేన్లను అందుబాటులో ఉంచనున్నారు.
భారీ వంతెనలు.. బైపాస్‌లు
ఈ ప్రాజెక్టులో 9 భారీ వంతెనలు, 23 చిన్న వంతెనలు, ఐదు బైపాస్‌లు, 25 అండర్‌పాస్‌లు నిర్మించారు. మానకొండూరు బైపాస్ వద్ద నిర్మించిన 560 మీటర్ల పొడవైన వంతెన ప్రాజెక్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీటితోపాటు ఒక ఆర్వోబీ, ఒక ఆర్యూబీని కూడా నిర్మించారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
హైవే నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు కూడా అధికారులు ప్రాధాన్యం ఇచ్చారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా 25 ప్రాంతాల్లో భూగర్భ జలాల పునరుద్ధరణ నిర్మాణాలను చేపట్టారు. రహదారి మధ్య భాగంతోపాటు ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. వాటి సంరక్షణ కోసం అవసరమైన ప్రాంతాల్లో నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు.
పరిశ్రమలు, వ్యవసాయానికి ఊతం
కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమను హనుమకొండలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో అనుసంధానించడంలో ఈ హైవే కీలకంగా మారనుంది. సరకు రవాణా వేగవంతం కావడంతో పారిశ్రామిక కార్యకలాపాలతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కూడా ప్రయోజనం కలగనుంది. దీంతో ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు ఈ రహదారి గ్రోత్ కారిడార్‌గా మారే అవకాశం ఉంది.






