హైదరాబాద్: తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయించింది. దరఖాస్తుదారులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, వచ్చే నెల మొదటి వారంలో అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎంపిక ప్రక్రియ పూర్తయిన అనంతరం అర్హత పొందిన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. దసరా పండుగ సందర్భంగా కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
సర్టిఫికెట్ల సమస్యతో జాప్యం
కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురికి నిబంధనల ప్రకారం అవసరమైన సర్టిఫికెట్లను సకాలంలో పొందడం కష్టంగా మారింది. దీంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో జాప్యం ఏర్పడింది. ఈ నెలలోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ.. సర్టిఫికెట్ల సమస్య కారణంగా మరికొన్ని రోజులు గడువు పెంచాలని నిర్ణయించింది.
2.5 లక్షల కొత్త పెన్షన్లు
తెలంగాణలో 2.5 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సెర్ప్ ఆధ్వర్యంలో గత నెల 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తొలుత ఆగస్టు నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇచ్చారు. అయితే దరఖాస్తు సమయంలోనే అవసరమైన అన్ని సర్టిఫికెట్లను జత చేయడం చాలామందికి సాధ్యం కాలేదు. దీంతో దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. అంతేకాకుండా దరఖాస్తు చేసుకునే సమయంలో సర్టిఫికెట్లు లేకపోయినా.. దరఖాస్తుల పరిశీలన సమయంలో వాటిని సమర్పించే అవకాశం కల్పించారు.
వీరికి సర్టిఫికెట్ల సమస్య
ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, డయాలసిస్ రోగులు, ఫైలేరియా బాధితులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వీరి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోంది.విడాకులు పొందిన ఒంటరి మహిళలకు కోర్టు ఉత్తర్వులు లేదా కనీసం ఏడాది కాలంగా ఒంటరిగా ఉంటున్నట్లు తహసీల్దార్ (MRO) నివేదిక అవసరం అవుతోంది. వివాహం కాని ఒంటరి మహిళలకు పంచాయతీ లేదా వార్డు అధికారుల వెరిఫికేషన్ అవసరమవుతోంది.
వితంతువులకు మరో సమస్య
భర్త మరణించి రెండేళ్లు దాటిన వితంతువులకు మరణ ధ్రువీకరణ పత్రం జారీ విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సర్టిఫికెట్‌ను జారీ చేసే అధికారం ఎవరికి ఉందనే అంశంపై స్పష్టత లేకపోవడంతో పలువురి దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.ఈ సమస్యలను ప్రభుత్వం, సెర్ప్ అధికారులు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన వెసులుబాట్లు కల్పించాలని సంబంధిత అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
దసరాకు కొత్త పెన్షన్లు ?
మొత్తంగా కొత్త పెన్షన్ల దరఖాస్తుల పరిశీలనను ఈ నెలాఖరు వరకు పూర్తి చేసి.. వచ్చే నెల మొదటి వారంలో అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రక్రియ సకాలంలో పూర్తయితే దసరా పండుగ సందర్భంగా 2.5 లక్షల మంది అర్హులకు కొత్త పెన్షన్లు అందే అవకాశం ఉంది





