Sunday, May 10, 2026

TVK విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు చక్రం తిప్పిన స్టాలిన్.. ఎలాగో తెలుసా..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ అనూహ్యంగా 107 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. జోసెఫ్ విజయ్ చరిత్రాత్మక విజయాన్ని అందుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలోనే నిలిచిపోయారు. స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేకపోవడంతో, చిన్న పార్టీల మద్దతు కోసం విజయ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే మొత్తానికి 120 సంఖాబలంతో విజయ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇలాంటి సమయంలో అధికారం కోసం అనుభవం ఉన్న రాజకీయ నాయకులు చక్రం తిప్పుతూ విజయ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోగలుగుతారు. అయితే విజయ్ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోకుండా ప్రజల మన్ననలు పొందడంతో పాటు తన శత్రువు పార్టీ ఏఐడీఎంకేకు చెక్ పెట్టడంలో మాజీ సీఎం స్టాలిన్ సక్సెస్ సాధించారు.. అదెలాగో ఈ స్టోరీలో చూడండి..

తమిళనాడు రాజకీయ పరిస్థితులు ఇటీవల అనూహ్య మలుపులు తిరిగాయి. ఇటీవల వెలువడిన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అత్యధికంగా TVK 107, DMK 59, AIDMk 47, INC 5, PMK 4, IUML 2, CPI 2, CPM 2, VCK 2, BJP 1 DMDK 1, AMMKA1 స్థానాల్లో గెలుపొందాయి. వీటిలో అత్యధికంగా టీవీకే 107 స్థానాల్లో గెలుపొందడంతో మిగతా పార్టీలను కలుపుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్ల అవసరం. అయితే టీవీకే పార్టీకి AIDMK తో కలిసి వెళ్తే సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. కానీ ఎన్నికల ముందు నుంచే విజయ్ ఒంటరిగా ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు గెలిచాక ఏఐడీఎంకే పార్టీతో కలిసివెళ్లడం కరెక్ట్ కాదని భావించారు. అందులోనూ ఈ పార్టీ బీజేపీ కూటమికి చెందిన పార్టీ. దీంతో విజయ్ ఈ పార్టీతో కలిసి వెళ్లడానికి అస్సలు ఇష్టపడలేదు.

అత్యధిక స్థానాలు గెలుచుకున్న మరో పార్టీ DMK. ఒక దశలో ఈ పార్టీ ఏఐడీఎంకే పార్టీ (59+47)తో పాటు అప్పటికే తన కూటమిలో ఉన్న కాంగ్రెస్ (5) వామపక్షాలు 4 తో పాటు మరికొందరిరితో సంప్రదింపులు చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఒక దశలో తన పాత శత్రుత్వాన్ని మరిచి ఏఐడీఎంకేతో కలిసి వెళ్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ స్టాలిన్ ఆ పని చేయలేదు. ఇక్కడ రాజకీయ నీతిని పాటించారు. విజయ్ కి ఎక్కువ స్థానాలు ఉండడంతో తన ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డుపడనని బహిరంగంగా ప్రకటించారు. అంతేకాకుండా ఎన్నికల ఫలితాల తరువాత ఓ సమావేశం ఏర్పాటు చేసి విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు తన కూటమిలోని పార్టీలకు అవకాశం ఇచ్చారు. చిరుతైగల్ కట్చి (VCK) నేతలు కూడా తొలుత సందిగ్ధంలో ఉన్నప్పటికీ, స్టాలిన్‌తో సుదీర్ఘ చర్చల తర్వాతే విజయ్ వైపు మొగ్గు చూపడం గమనార్హం.

అయితే ఇక్కడ తనను ఏమాత్రం సంప్రదించకుండా నేషనల్ కాంగ్రెస్ విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడంపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఒక వైపు తన కూటమిలోని VCK పార్టీ TVKకి మద్దతు విషయంలో సానుకూలంగా ఉన్నారు. ఇక్కడ స్టాలిన్ ను కలవకపోవడమే కాంగ్రెస్ తప్పిదం అన్నట్లుగా మారింది.

ఇదిలా ఉండగా విజయ్ కి VCK మద్దతు ఇవ్వకపోతే AIDMK ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే అటు విజయ్ పార్టీతో పాటు ఇటు డీఎంకే పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు స్టాలిన్ భావించారు. దీంతో తన శత్రువు పార్టీ అయిన ఏఐడీఎంకేకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయ్ కు దారి చూపించినట్లయింది.

ఈ మొత్తం వ్యవహారంలో స్టాలిన్ రెండు విషయాల్లో విజయం సాధించారు. ఒకవైపు ప్రత్యర్థి పార్టీ అయినా పరోక్షంగా మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించడం ద్వారా తన ‘రాజకీయ హుందాతనాన్ని’ నిరూపించుకున్నారు. మరోవైపు, అధికారం కోసం అడ్డదారులు తొక్కకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడారనే పేరు తెచ్చుకుని ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఓడిపోయినా కూడా గెలిచిన నేతగా స్టాలిన్ ఈ సంక్షోభంలో చక్రం తిప్పడం విశేషం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News