Komura Velli Railway station: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఇక్కడికి బస్సులు,కార్లు, ఆటోల ద్వారా మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు రైలు సౌకర్యం ద్వారా కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా బస్సులతో పోలిస్తే రైలు చార్జీలు కూడా చాలా తక్కువగా ఉండడంతో చాలామంది ఆసక్తి చూపుతున్నారు. మరి కొమురవెల్లి రైల్వేస్టేషన్ కు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళితే ఎలాంటి చార్జీలు..? పూర్తి వివరాల్లోకి వెళితె..
కొమురవెల్లి రైల్వే స్టేషన్‌లో ప్రధానంగా సికింద్రాబాద్–సిద్దిపేట మార్గంలోని డెమూ రైళ్లకు హాల్ట్ కల్పించారు.అంటే తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట, జనగామ వైపు నుంచి వచ్చే భక్తులకు ఇది నేరుగా ఉపయోగపడుతుంది. సిద్దిపేట నుంచి వచ్చే రైళ్లు ఉదయం 6:45, మధ్యాహ్నం 2:38కి బయలుదేరి ఇక్కడ ఆగుతాయి. సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లు మధ్యాహ్నం 12:44, రాత్రి 8:04కి బయలుదేరి ఆగుతాయి. కొమురవెల్లి రైల్వే స్టేషన్ నుంచి మల్లన్న ఆలయం సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్టేషన్ నుంచి మెయిన్ రోడ్డుకు 500 మీటర్ల మేర ప్రత్యేకంగా సీసీ రోడ్ కూడా నిర్మించారు. కాబట్టి ఇక్కడిదాకా వెళ్లి ఆటోల్లో వెళ్లొచ్చు. సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లి రైల్వేస్టేషన్ కు రూ.25..సిద్ధిపేట నుంచి రూ. 10గా టికెట్ ధర ఉంది. దీంతో తక్కువ ఖర్చుతోనే కొమురవెల్లికి వెళ్లొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారు నేరుగా సికింద్రాబాద్ కు వెళ్లి అక్కడి నుంచి క్షేత్రానికి చేరుకోవడం సౌకర్యం.
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ద్వారా భక్తులకు మాత్రమే కాకుండా చిరువ్యాపారులకు, క్షేత్రానికి రోజూ ప్రయానం చేసేవారికి ఎంతో సౌకర్యంగా ఏర్పడింది. ఈ క్షేత్రానికి ప్రతీ బుధవారం, ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సట్టేడ్ వారాల్లో మరింత రద్దీ ఉంటుంది.





