Varalaxmi Vratham Begin Story: పూజలు, వ్రతాలు, పండుగలకు ప్రత్యేకమైన కాలంగా శ్రావణ మాసంను భావిస్తారు. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. అయితే వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు ప్రారంభమైంది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే చారుమతి కథను తెలుసుకోవాలి.
పురాణ కథనం ప్రకారం.. మగధ సామ్రాజ్యంలో కుండిన నగరంలో చారుమతి అనే సద్గుణవతి ఉండేది. ఆమె తన భర్తను ఎంతో ప్రేమగా చూసుకోవడంతో పాటు అత్తమామలను కూడా భక్తిశ్రద్ధలతో సేవించేది. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించడం, పెద్దలను ఆదరించడం, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమతో వ్యవహరించడం ఆమెకు అలవాటుగా ఉండేది. భర్త, అత్తమామల సేవను దైవసేవగా భావిస్తూ ఆమె తన జీవితాన్ని కొనసాగించేది.
చారుమతి చూపిస్తున్న భక్తి, వినయం, సేవాభావానికి శ్రీ మహాలక్ష్మీదేవి ప్రసన్నమైంది. ఒకరోజు రాత్రి చారుమతికి కలలో మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చింది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం తనను వరలక్ష్మీ స్వరూపంగా భావించి పూజించి వ్రతం ఆచరించాలని అమ్మవారు సూచించారు.
ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే కోరిన వరాలను ప్రసాదిస్తానని మహాలక్ష్మీదేవి చారుమతికి చెప్పారు. తెల్లవారిన తర్వాత చారుమతి తనకు వచ్చిన కల గురించి అత్తమామలకు, భర్తకు, స్నేహితురాళ్లకు వివరించింది. మహాలక్ష్మీదేవి స్వయంగా వ్రతం చేయాలని సూచించిందని చెప్పడంతో అందరూ ఎంతో సంతోషించారు. అమ్మవారి ఆదేశాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారు.
శ్రావణ మాసంలోని శుక్రవారం రోజున చారుమతి ఇంట్లో వరలక్ష్మీ వ్రతం నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న మహిళలు కూడా ఈ వ్రతంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. శ్రావణ శుక్రవారం ఉదయం మహిళలంతా తలస్నానాలు చేసి, సంప్రదాయ దుస్తులు ధరించి చారుమతి ఇంటికి చేరుకొని ఇంటిని శుభ్రం చేసి పూజా మండపాన్ని ఏర్పాటు చేశారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, కొబ్బరికాయ, దీపాలు తదితర పూజా సామగ్రిని సిద్ధం చేసుకున్నారు.
అనంతరం కలశాన్ని ఏర్పాటు చేసి దానిపై కొబ్బరికాయను ఉంచి, వరలక్ష్మీదేవి రూపంగా అలంకరించారు. అమ్మవారిని భక్తితో ఆహ్వానించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.చారుమతితో పాటు ఇతర మహిళలు కూడా అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు సమర్పిస్తూ పూజలు చేశారు. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని చదివి, వివిధ స్తోత్రాలను పారాయణం చేశారు. అనంతరం వరలక్ష్మీ వ్రత కథను విని అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చారు.వ్రతంలో భాగంగా తోరాన్ని పూజించి మహిళలు తమ చేతులకు కట్టుకున్నారని కూడా కథనాల్లో పేర్కొంటారు. అమ్మవారి అనుగ్రహం తమ కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ మహిళలు భక్తితో ప్రార్థించారు.
పూజ పూర్తయిన అనంతరం చారుమతి ఇంట్లో అద్భుతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమెతో పాటు వ్రతంలో పాల్గొన్న మహిళలకు కూడా అమ్మవారి అనుగ్రహంతో ఐశ్వర్యం, సౌభాగ్యం, సుఖసంతోషాలు కలిగాయి. వారు తమ కుటుంబాలతో కలిసి ఆనందంగా జీవించారని, ఆ తర్వాత ఈ వ్రతాన్ని ఇతర మహిళలు కూడా ప్రారంభించారు.
వరలక్ష్మీదేవిని సంపదను ప్రసాదించే దేవతగా మాత్రమే కాకుండా సౌభాగ్యం, ఆరోగ్యం, ధైర్యం, సంతానం, విజయం, విద్య వంటి శుభఫలాలకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. అందుకే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం.ముఖ్యంగా వివాహిత మహిళలు తమ భర్తకు దీర్ఘాయుష్షు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు, ఇంటి శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ వ్రతం కేవలం సంపద కోసమే కాకుండా కుటుంబ క్షేమం కోసం చేసే ఆధ్యాత్మిక సాధనగా కూడా భావించవచ్చు.





