ఖగోళంలో అరుదుగా జరిగే అద్భుతాల్లో ఒకటైన సంపూర్ణ సూర్యగ్రహణం ఇటీవల వీక్షకులను, శాస్త్రవేత్తలను విశేషంగా ఆకట్టుకుంది. సూర్యుడికి, భూమికి మధ్యగా చంద్రుడు ఖచ్చితమైన సరళరేఖలోకి వచ్చి సూర్యకాంతిని పూర్తిగా కప్పివేయడంతో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ అరుదైన ఖగోళ దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతాల్లో వేర్వేరు రూపాల్లో ఆవిష్కృతమైంది.ఈ గ్రహణ ప్రభావంతో గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో పగటిపూటే రాత్రి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా స్పెయిన్ లో కనిపించిన వీడియో వైరల్ గా మారింది.
దాదాపు 2 నిమిషాల 18 సెకన్ల పాటు సూర్యుడు పూర్తిగా మరుగైపోవడంతో ఆయా ప్రాంతాలు చిమ్మచీకట్లోకి జారుకున్నాయి. విరామం లేకుండా వెలుగునిచ్చే భానుడు క్షణకాలం మాయమవడంతో ప్రజలు, పర్యాటకులు ఈ అద్భుతాన్ని ఆసక్తిగా వీక్షించారు.ఈ సంపూర్ణ గ్రహణంతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం దర్శనమిచ్చింది. యూరప్‌లోని ఎక్కువ భాగాలు, వాయవ్య ఆఫ్రికా, ఈశాన్య ఉత్తర అమెరికా ఖండాల్లోని ప్రజలు సూర్యుడిని చంద్రుడు కొంతమేర మాత్రమే కప్పివేయడాన్ని తిలకించారు.
విశేషమేమిటంటే, పశ్చిమ యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో సూర్యాస్తమయ సమయంలోనే ఈ గ్రహణం ఏర్పడటంతో ఆకాశంలో ‘సన్‌సెట్ ఎక్లిప్స్’ అనే నయన మనోహరమైన దృశ్యం కనువిందు చేసింది.సాధారణ రోజుల్లో సూర్యుడి తీవ్రమైన వెలుగు వల్ల ఆయన బాహ్య వాతావరణమైన ‘కరోనా’ కంటికి కనిపించదు. కానీ ఈ సంపూర్ణ గ్రహణం సమయంలో చంద్రుడు సూర్య బింబాన్ని పూర్తిగా కప్పివేయడంతో కరోనాను స్పష్టంగా పరిశీలించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక సువర్ణావకాశం లభించింది.
Spain went dark in broad daylight. 🌑🇪🇸
— SriSathya (@sathyashrii) August 13, 2026
Nature really knows how to leave us speechless. 🇪🇸✨ pic.twitter.com/jpE1ZrJtPi





