house survived Nepal flood: నేపాల్‌లోని పర్వత ప్రాంతాల్లో సంభవించిన భారీ ప్రకృతి విపత్తు విధ్వంసాన్ని సృష్టించింది. కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన వరదనీరు, బురద, రాళ్లు, చెట్ల దుంగలు కలిసి భారీ శిథిల ప్రవాహంగా మారాయి. ఈ ప్రవాహం మార్గంలో ఉన్న ఇళ్లు, రహదారులు, వాహనాలు, ఇతర నిర్మాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఇలాంటి విధ్వంసం మధ్యలో ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచిన దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇంతటి భారీ వరదను ఈ ఇల్లు ఎలా తట్టుకోగలిగింది? దీనిపై కొందరు నిపుణులు ఏమంటున్నారు? (వీడియో కోసం కిందికి వెళ్లండి)
అదృష్టమా? నిర్మాణ సామర్థ్యమా?
చాలా మంది ఈ దృశ్యాన్ని చూసి ఆ ఇంటి యజమాని అదృష్టం అని అంటున్నారు. మరికొందరు మాత్రం దీనిని నిర్మించిన ఇంజనీర్ కు అవార్డు ఇవ్వాలని అంటున్నారు. అయితే ఒక భవనం ప్రకృతి విపత్తును తట్టుకుని నిలబడటంలో అదృష్టంతో పాటు నిర్మాణ విధానం, భవనం ఉన్న ప్రదేశం, పునాది బలం, ఆకృతి, పదార్థాల నాణ్యత వంటి అనేక అంశాలు కీలకంగా పనిచేస్తాయి. ముఖ్యంగా బురద, రాళ్లు, నీరు కలిసి వేగంగా కదిలే డెబ్రిస్ ఫ్లో వంటి విపత్తుల్లో భవనంపై పడే శక్తి సాధారణ వరదల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా ఈ ఇల్లు ఎలా నిలబడింది.
బరువు మోగలిగినా..
హిమాలయ ప్రాంతాల్లో చాలా కాలంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాతి, ఇటుక లేదా ఇతర సంప్రదాయ పదార్థాలతో ఇళ్లు నిర్మిస్తున్నారు. సరైన నిర్మాణ సాంకేతికతతో నిర్మిస్తే ఇలాంటి ఇళ్లు సాధారణ పరిస్థితుల్లో బలంగా ఉంటాయి. కానీ రీన్‌ఫోర్స్‌మెంట్ లేకుండా నిర్మించిన గోడలు భవనం బరువును కిందికి మోయగలిగినా, పక్క వైపు నుంచి ఒక్కసారిగా వచ్చే భారీ శక్తిని తట్టుకోవడం కష్టమవుతుంది. ఉదాహరణకు, ఒక గోడపై భారీ బురద, రాళ్ల ప్రవాహం బలంగా ఢీకొంటే ఆ శక్తి గోడను బయటకు నెట్టేలా పనిచేస్తుంది. గోడలను ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానించే నిర్మాణ వ్యవస్థ లేకపోతే గోడలు విడిపోయే ప్రమాదం ఉంటుంది.
రీన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ ఫ్రేమ్ అంటే?
ఇలాంటి పరిస్థితుల్లో రీన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ ఫ్రేమ్ నిర్మాణం ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలుగుతుంది. దీనిని . కాంక్రీట్‌తో పాటు స్టీల్ రీబార్లను ఉపయోగించి స్తంభాలు, భీములు, పునాదులను పరస్పరం అనుసంధానిస్తారు. దీంతో భవనం కేవలం విడివిడిగా ఉన్న గోడల సమూహంగా కాకుండా ఒక సమగ్ర నిర్మాణ వ్యవస్థగా పనిచేస్తుంది.భవనంపై ఒక వైపు నుంచి భారీ శక్తి వచ్చినప్పుడు ఆ శక్తిని స్తంభాలు, బీములు, గోడలు, పునాదులు కలిసి ఎదుర్కొంటాయి. ఒక భాగంపై పడిన ఒత్తిడి కొంతవరకు ఇతర భాగాలకు పంపిణీ అవుతుంది. ముఖ్యంగా సరైన డిజైన్, సరైన రీబార్ అమరిక, మంచి కాంక్రీట్ నాణ్యత, బలమైన జాయింట్లు ఉంటే భవనం ఒక్కసారిగా కూలిపోకుండా కొంతకాలం వరకు లోడ్‌ను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.
బురద ప్రవాహం ఎలా పనిచేస్తుంది?
సాధారణ నీటి ప్రవాహం కంటే బురద ప్రవాహం అధిక శక్తిని కలిగి ఉంటుంది. ఇందులో నీటితో పాటు మట్టి, ఇసుక, చిన్న రాళ్లు, భారీ బండరాళ్లు, చెట్ల కొమ్మలు, నిర్మాణ శిథిలాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి అత్యంత భారీ ద్రవ్యరాశిగా మారుతాయి. కొండ ప్రాంతాల్లో వాలు ఎక్కువగా ఉండటంతో ఈ మిశ్రమం వేగంగా కిందికి కదులుతుంది. ప్రవాహం వేగం పెరిగిన కొద్దీ దాని వద్ద ఉన్న కదలిక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పెద్ద బండరాళ్లు ప్రవాహంలో కొట్టుకువస్తే అవి భవనాన్ని ఢీకొట్టే సమయంలో స్థానికంగా అత్యంత భారీ ప్రభావాన్ని కలిగించవచ్చు. అందుకే కేవలం గోడ మందంగా ఉండటం మాత్రమే భవనం రక్షణకు సరిపోదు. భవనం ఏ దిశలో, ఏ స్థలంలో, ఏ పునాదిపై నిర్మించబడిందనేది కూడా అంతే ముఖ్యం.
ఇంటి ఆకృతి కూడా ముఖ్యమే..
భవనం ఆకారం కూడా శిథిల ప్రవాహాన్ని ఎదుర్కొనే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్దగా బయటకు పొడుచుకొచ్చిన భాగాలు, బలహీనమైన గోడలు లేదా విస్తారమైన ఓపెనింగ్స్ ఉన్న నిర్మాణాలపై ప్రవాహం ఎక్కువగా ప్రభావం చూపవచ్చు. దీనికి భిన్నంగా కాంపాక్ట్‌గా, బలమైన ఫ్రేమ్‌తో నిర్మించిన భవనం ప్రవాహాన్ని కొంతవరకు పక్కలకు మళ్లించే అవకాశం ఉంటుంది. బురద మొదట భవనాన్ని ఢీకొన్నప్పుడు దాని కొంత భాగం గోడకు ఆనుకుని పేరుకుపోతుంది. ఆ తర్వాత పేరుకుపోయిన మట్టి, రాళ్లు ఒక చిన్న సహజ అడ్డంకిలా మారవచ్చు. దీంతో తరువాత వచ్చే ప్రవాహం పూర్తిగా భవనాన్ని ఢీకొట్టకుండా కొంతవరకు పక్కకు మళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు.
పునాది బలంగా ఉండాలి..
భవనం పైభాగం ఎంత బలంగా ఉన్నా పునాది బలహీనంగా ఉంటే ప్రమాదం తప్పదు. డెబ్రిస్ ఫ్లో సమయంలో భవనం పక్క నుంచి ఒత్తిడి మాత్రమే కాకుండా పునాది చుట్టూ ఉన్న మట్టి కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. దీనిని స్కౌరింగ్ లేదా మట్టికొట్టుకుపోవడం వంటి ప్రక్రియలతో పోల్చవచ్చు. పునాది కింద ఉన్న నేల తొలగిపోయినా లేదా భవనం ఒక వైపు నేల బలహీనపడినా భవనం వంగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పర్వత ప్రాంతాల్లో భవనం నిర్మించేటప్పుడు నేల స్థిరత్వం, పునాది లోతు, నీటి ప్రవాహ మార్గం, డ్రైనేజీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
Explanation into how this house survived Nepal flood. pic.twitter.com/DAHHG0BSyh
— Architecture Presentation (@arcpresentation) August 30, 2026





