Hyderabad CURE: హైదరాబాద్ నగరంలోని నిరుపేదలు, అల్పాదాయ వర్గాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకం తొలి దశలో CURE (Core Urban Region Economy) పరిధిలో నివసించే అర్హుల నుంచి మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తోంది. అసలు క్యూర్ అంటే ఏమిటి? ఈ పరిధిలో ఎవరు ఉంటారు?
CURE అంటే..
CURE (Core Urban Region Economy) అనేది హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పట్టణ పరిపాలనా, అభివృద్ధి పరిధి. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరాన్ని ఒకే ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాలను సమన్వయంతో అందించడం, గృహ నిర్మాణం, రవాణా, రోడ్లు, డ్రైనేజీ, పట్టణ సేవలను మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం. ఇది ఒకే శాఖ కాదు, హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే పరిపాలనా భావన.
క్యూర్ పరిధిలో వారికే ఎందుకు అవకాశం?
హైదరాబాద్‌లో భూముల కొరత కారణంగా పేదలకు నగరంలోనే ఇళ్లు నిర్మించడం పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో నగర కేంద్ర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆర్థికంగా బలహీన వర్గాలకు వారి ఉపాధి, పిల్లల చదువు, రోజువారీ జీవనానికి అంతరాయం కలగకుండా అదే ప్రాంతానికి సమీపంలో బహుళ అంతస్తుల ఇందిరమ్మ గృహాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే తొలి ఈ పరిధిలోని అర్హులకు ప్రాధాన్యం ఇస్తోంది.

మిగతా వారికంటే క్యూర్ ప్రాంత ప్రజలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?
క్యూర్ పరిధిలోని లబ్ధిదారులకు నగరానికి దూరంగా కాకుండా, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లను నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు, కూలి పనులు, పిల్లల విద్య, ఆస్పత్రులు వంటి అవసరాలకు ఇబ్బంది కలగదు. గతంలో నగర శివార్లలో నిర్మించిన గృహాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి నగర జీవన విధానానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించారు.
CURE పరిధిలో ఏయే ప్రాంతాలు ఉంటాయి?
ఈ పరిధి ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ నగర ప్రధాన పట్టణ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఇందులో జీహెచ్ ఎంసీ పరిధిలోని ఎక్కువ భాగం, అలాగే నగరంతో అనుసంధానమైన కొన్ని పట్టణ ప్రాంతాలు వస్తాయి. ప్రభుత్వం ఈ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించింది. తొలి విడతలో వాటిలో 16 నుంచి 17 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తోంది. మిగతా నియోజకవర్గాలను కూడా దశలవారీగా చేర్చే ప్రణాళిక ఉంది.
అంటే హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని ORR లోపలి పట్టణ ప్రాంతాలు ఇందులోకి వస్తాయి. ఖైరతాబాద్, నాంపల్లి, అంబర్‌పేట, కర్వాన్, మలక్‌పేట, బహదూర్‌పురా, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, శేరిలింగంపల్లి, రాయదుర్గం మల్కాజిగిరి, మేడ్చల్ పరిధిలోని పట్టణ ప్రాంతాలు, పోచారం, కౌకూర్ రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, మహేశ్వరం పరిధిలోని జల్పల్లి, ఇబ్రహీంపట్నం పరిధిలోని బండ్లగూడ ప్రాంతం, జూబ్లీహిల్స్, రెడ్‌హిల్స్, కుల్సుంపుర, గడ్డిఅన్నారం, గజులరామారం, పటిగడ్డ, మర్రేడ్‌పల్లి తదితర ప్రాంతాలు క్యూర్ పరిధిలోకి వస్తాయి.
ఎలాంటి ఇళ్లు నిర్మించనున్నారు?
హైదరాబాద్‌లో భూమి కొరత దృష్ట్యా సాధారణ ఇండ్లకు బదులుగా G+10 వరకు బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో సుమారు ఒక లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుంది. లబ్ధిదారులకు ప్రభుత్వ సబ్సిడీతో అందుబాటు ధరల్లో ఫ్లాట్లు అందించనున్నారు. మహిళల పేరుతో యాజమాన్య హక్కులు కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
దరఖాస్తు చేసుకునే అర్హులు ఎవరు?
క్యూర్ పరిధిలో నివసించే నిరుపేదలు, అల్పాదాయ వర్గాలు, సొంత ఇల్లు లేని కుటుంబాలు ప్రభుత్వ నిర్దేశించిన అర్హతలను పూర్తి చేస్తే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను మీసేవ కేంద్రాలు మరియు ప్రభుత్వం సూచించిన ఇతర అధికారిక మార్గాల ద్వారా స్వీకరిస్తున్నారు. అర్హతలు, అవసరమైన పత్రాలు, ఆదాయ పరిమితి వంటి వివరాలను ప్రభుత్వం ప్రత్యేక బ్రోచర్లో వెల్లడించింది.





