Delhi Jantar Mantar History: దేశ రాజధాని ఢిల్లీలో ఏదైనా కీలక అంశంపై నిరసన చేపట్టాలంటే ముందుగా గుర్తుకొచ్చే ప్రదేశాల్లో ‘జంతర్ మంతర్’ ఒకటి. పార్లమెంట్‌కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజా ఉద్యమాలకు వేదికగా నిలుస్తోంది. అయితే నేడు నిరసనలకు ప్రసిద్ధి చెందిన జంతర్ మంతర్‌కు దాదాపు 300 ఏళ్ల క్రితం పూర్తిగా భిన్నమైన చరిత్ర ఉంది. ఆ వివరాల్లోకి వెళితె..
1724లో నిర్మాణం.. మహారాజా జై సింగ్ II కృషి
జంతర్ మంతర్‌ను 1724లో జైపూర్ మహారాజా సవాయి జై సింగ్ II నిర్మించారు. ఆ కాలంలో ఖగోళ పరిశోధనలకు ఉపయోగిస్తున్న పరికరాలు చిన్నవిగా ఉండటం వల్ల ఖచ్చితమైన కొలతలు తీసుకోవడం కష్టంగా ఉండేది. దీంతో మరింత పెద్దవిగా, ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చేలా ప్రత్యేక ఖగోళ పరికరాలతో ఈ వేదశాలను ఏర్పాటు చేశారు. జై సింగ్ II ఢిల్లీతో పాటు జైపూర్, ఉజ్జయిని, వారణాసి, మథురలోనూ ఇలాంటి ఖగోళ పరిశోధనా కేంద్రాలను నిర్మించారు. ఇవి అప్పటి భారతదేశంలో ఖగోళ శాస్త్ర అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయి.

‘జంతర్ మంతర్’ అనే పేరు ఎలా వచ్చింది?
‘జంతర్ మంతర్’ అనే పేరు సంస్కృతంలోని ‘యంత్ర’, ‘మంత్ర’ అనే పదాల నుంచి వచ్చిందని సాధారణంగా చెబుతారు. ‘యంత్ర’ అంటే పరికరం లేదా సాధనం కాగా, ‘మంత్ర’కు ఇక్కడ సూత్రం, గణన అనే అర్థాలు ఉన్నాయి. అంటే ఖగోళ విషయాలను పరికరాలు, గణిత సూత్రాల ఆధారంగా అధ్యయనం చేసే ప్రదేశంగా దీనికి ఈ పేరు ఏర్పడింది.
ఆకాశాన్ని కొలిచిన భారీ పరికరాలు
జంతర్ మంతర్‌లోని నిర్మాణాలు సాధారణ భవనాలు కావు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాల స్థానాలు, కాల గణన వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు భారీ రాతి, ఇటుక నిర్మాణాలతో ప్రత్యేక పరికరాలను రూపొందించారు. ఇక్కడ మొత్తం 13 ఖగోళ పరికరాలు ఉన్నట్లు ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ పేర్కొంది. వాటిలో సమ్రాట్ యంత్ర, జై ప్రకాశ్ యంత్ర, మిశ్ర యంత్ర ప్రధానమైనవి. సమ్రాట్ యంత్రం ఒక భారీ సూర్యఘడియలా పనిచేస్తే, జై ప్రకాశ్ యంత్రం ద్వారా ఆకాశంలోని నక్షత్రాలు, ఇతర ఖగోళ వస్తువుల స్థానాలను గుర్తించేవారు. మిశ్ర యంత్రం సంవత్సరంలో పొడవైన, చిన్న రోజుల వంటి అంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది.
పార్లమెంట్‌కు దగ్గరగా ఉండటంతో నిరసనలకు వేదిక
కాలక్రమేణా జంతర్ మంతర్ చుట్టూ ఢిల్లీ నగరం విస్తరించింది. పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఉండటం వల్ల ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం ప్రారంభించారు. ఢిల్లీ దేశ రాజధాని కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు ప్రభుత్వాన్ని నేరుగా చేరుకునే అవకాశం ఈ ప్రాంతం కల్పించింది. ఈ కారణంగా జంతర్ మంతర్ క్రమంగా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, బహిరంగ సభలకు ప్రముఖ వేదికగా మారింది. సుప్రీంకోర్టు తీర్పులోనూ 1993 నుంచి జంతర్ మంతర్ శాంతియుత నిరసనలకు వేదికగా ఉపయోగించబడినట్లు ప్రస్తావన ఉంది.
ఒకప్పుడు ‘బోట్ క్లబ్’.. ఆ తర్వాత జంతర్ మంతర్
ఢిల్లీలోని నిరసనల చరిత్రలో జంతర్ మంతర్‌కు ముందు బోట్ క్లబ్ ప్రాంతం కూడా ప్రముఖ వేదికగా ఉండేది. అయితే అక్కడ భారీ నిరసనల వల్ల ట్రాఫిక్, ప్రజా రవాణాకు ఇబ్బందులు ఏర్పడటంతో నిరసనలపై ఆంక్షలు విధించబడ్డాయి. అనంతరం జంతర్ మంతర్ ప్రాంతం ఆందోళనలకు ప్రత్యామ్నాయ వేదికగా మారింది. పార్లమెంట్‌కు సమీపంగా ఉండటంతో నిరసనకారులు తమ గళాన్ని ప్రభుత్వ పెద్దలకు, ప్రజలకు సులభంగా వినిపించగలిగే ప్రాంతంగా దీనిని భావించారు.
ప్రతి అంశంపై ఇక్కడే ఆందోళనలు ఎందుకు?
జంతర్ మంతర్ ప్రత్యేకత కేవలం దాని భౌగోళిక స్థానంలోనే లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఢిల్లీకి వస్తుంటారు. రైతులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు, వివిధ సామాజిక సంస్థలు తమ డిమాండ్ల కోసం ఇక్కడ నిరసనలు నిర్వహించాయి. ఒక సమస్యపై ప్రజా ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చకు రావాలంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టడం ఒక ప్రతీకగా మారింది.





