తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ పార్టీ TVK మెజారిటీ వైపు దూసుకుపోతుంది. దాదాపు ఎవరి పొత్తు లేకుండా అధికారంలోకి రావడం అన్నట్లుగా వాతావరణం మారిపోతుంది. అసలు ఈ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటీ? తరతరాలుగా రాజకీయాల్లో ఆరితేరిన DMKపార్టీని ఓడించడానికి ఎలాంటి పథకాలు, నిర్ణయాలు తీసుకున్నారు?
టీవీకే పార్టీ ఎన్నికల్లో గెలుపుకు ప్రధాన కారణం ప్రజలకు నేరుగా ఉపయోగపడే సంక్షేమ హామీలు ఇవ్వడం. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత, పేద వర్గాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన పథకాలు ఓటర్లను బలంగా ఆకర్షించాయి. ఆర్థిక భారం తగ్గించేలా, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా హామీలు ఇవ్వడం ద్వారా పార్టీపై విశ్వాసం పెరిగింది.
1.మదిప్పుమిగు మగళిర్ తిట్టం:
ఈ పథకం అత్యంత కీలకంగా నిలిచింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 60 ఏళ్లలోపు మహిళా గృహ యజమానులకు నెలకు రూ. 2,500 అందిస్తామని హామీ ఇచ్చారు. ఇది మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే కాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేలా ఉండటం వల్ల పెద్ద ఎత్తున మహిళల మద్దతు దక్కింది.
2.అన్నపూర్ణి సూపర్ సిక్స్ :
ఇది కూడా ప్రజలను ఆకట్టుకుంది. ప్రతి అర్హ కుటుంబానికి సంవత్సరానికి 6 ఉచిత LPG సిలిండర్లు అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా పెరుగుతున్న గ్యాస్ ధరల భారం తగ్గిస్తామని స్పష్టం చేశారు. ఇది మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు పెద్ద ఉపశమనం అనే భావన ఏర్పడింది.
3. అన్నన్ సీర్ తిట్టం:
ఆడబిడ్డల వివాహ సమయంలో 8 గ్రాముల బంగారం, పట్టు చీరలను అందిస్తామని ప్రకటించడం కూడా ఓటర్లను ఆకర్షించింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలపై ఉన్న పెళ్లి ఖర్చుల భారం తగ్గుతుందని ప్రజలు భావించారు.
4. కామరజార్ కల్వి ఉరుధి తిట్టం:
ఇది కీలక హామీగా నిలిచింది. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ. 15,000 సహాయం అందిస్తామని ప్రకటించారు. దీంతో పేద విద్యార్థులు చదువు మధ్యలో మానకుండా ఉండేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది విద్యకు ప్రాధాన్యత ఇచ్చే కుటుంబాలను ఆకట్టుకుంది.
5. వెట్రి పయనం తిట్టం:
మహిళల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచేందుకు ఈ పథకం ప్రకటించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇవ్వడం ద్వారా వారి రోజువారీ ఖర్చులు తగ్గుతాయని భావించారు.
ఇవే కాకుండా యువతను దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగ భృతి ద్వారా పట్టభద్రులైన నిరుద్యోగులకు నెలకు రూ. 4,000, డిప్లొమా హోల్డర్లకు రూ. 2,500 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశాన్ని చూపించారు.
వీటితోపాటు రైతులను ఆకట్టుకునేలా రుణమాఫీ హామీ ఇచ్చారు. 5 ఎకరాల వరకు భూమి ఉన్న చిన్న రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి 50% వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం రైతుల్లో నమ్మకం పెంచింది.





