Telangana Weather Report: హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఉక్కపోత, వేడితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. ఇప్పటి వరకు ఏయే ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు కురిశాయంటే?
వాతావరణ రిపోర్టు ప్రకారం.. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, కొమురం భీం, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌లో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తాంసి, తలమడుగు, ఇచ్చోడ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. వికారాబాద్, వరంగల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాలు విస్తారంగా కురిశాయి.
వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం దక్షిణ ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీనికి తోడు రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండటంతో తెలంగాణలో వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రానున్న రోజుల్లోనూ తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.





