RTC Electric Auto :తెలంగాణలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రయాణికులకు ఇంటి నుంచి గమ్యస్థానం వరకు నిరంతర ప్రయాణ సౌకర్యం కల్పించే లక్ష్యంతో ‘ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ పేరుతో ఎలక్ట్రిక్ ఆటో సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త వ్యవస్థతో బస్సులతో పాటు RTC అనుబంధంగా ఎలక్ట్రిక్ ఆటోలు కూడా సేవలు అందించనున్నాయి.
ప్రస్తుతం ప్రజలు బస్సు ఎక్కడానికి బస్‌స్టాప్‌కు చేరుకోవడం, అలాగే బస్సు దిగిన తర్వాత తుది గమ్యస్థానానికి వెళ్లడం కోసం వేర్వేరు ఆటోలు లేదా ఇతర రవాణా సౌకర్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా RTC తీసుకురాబోయే ఎలక్ట్రిక్ ఆటోలు ప్రయాణికులను ఇంటి దగ్గర నుంచి బస్‌స్టాప్‌కు, అలాగే బస్సు దిగిన తర్వాత గమ్యస్థానానికి చేర్చనున్నాయి. దీంతో ప్రయాణం మరింత సులభంగా, వేగంగా మారనుంది.
దీని కింద హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో నడుస్తున్న సుమారు 1.26 లక్షల ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.200 కోట్లను కేటాయించింది. ఆటో డ్రైవర్లపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు రెట్రోఫిట్‌మెంట్ ఖర్చుపై 100 శాతం సబ్సిడీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సేవలో మరో ప్రత్యేకత ఏమిటంటే, బస్సు మరియు ఆటో టికెట్లను ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఒకే బుకింగ్‌తో మొత్తం ప్రయాణానికి అవసరమైన రవాణా సౌకర్యం అందుబాటులో ఉండటంతో ప్రయాణికులకు సమయం, ఖర్చు రెండూ ఆదా కానున్నాయి. డిజిటల్ టికెటింగ్ ద్వారా ఈ సేవలను మరింత సులభంగా వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ ఎలక్ట్రిక్ ఆటో సేవలను తొలుత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రారంభించనున్నారు. అనంతరం దశలవారీగా కరీంనగర్ , వరంగల్ , నిజామాబాద్ వంటి ప్రధాన నగరాలకు విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి ప్రస్తుతం పలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలతో ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
ఈ చర్య తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణహిత రవాణా విధానంలో భాగంగా వస్తోంది. రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి, గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల రవాణాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇకపై ప్రభుత్వం కొనుగోలు చేసే అన్ని వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలే కావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఆర్టీసీ విద్యుత్ బస్సులను మాత్రమే నడపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నగరంలో డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గిస్తూ, పర్యావరణానికి మేలు చేసే రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హరిత ఇంధన వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. నెట్-జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని సాధించే దిశగా విద్యుత్ బస్సులు, ఎలక్ట్రిక్ ఆటోలు, ఇతర హరిత రవాణా వ్యవస్థలను విస్తృతంగా ప్రోత్సహించాలని యోచిస్తోంది.
ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే ప్రజా రవాణాలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లే అవుతుంది. ప్రయాణికులకు ఇంటి నుంచి గమ్యస్థానం వరకు సౌకర్యవంతమైన ప్రయాణం లభించడమే కాకుండా, ట్రాఫిక్ రద్దీ, ఇంధన వినియోగం, వాయు కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో కూడా ఈ ప్రణాళిక కీలక పాత్ర పోషించనుంది.





