Gold Silver Rates Toady:బంగారం, వెండి ధరలు వరుసగా పడిపోతున్నాయి.. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.55 లక్షల వద్దకు చేరింది. అంతకుముందు ఇది రూ.1.57 లక్షలుగా ఉండటంతో దాదాపు రూ.2 వేల వరకు తగ్గింది. వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది. కిలో వెండి ధర రూ.2,37,486 నుంచి రూ.2,34,478కు పడిపోయింది. అంటే కిలోకు దాదాపు రూ.3 వేల మేర తగ్గింది. అసలు ఇలా బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,143 వద్ద ట్రేడవుతోంది. వెండి ఫ్యూచర్స్ కిలోకు రూ.2,32,625 వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర సుమారు 4,307 డాలర్ల వద్ద ఉండగా.. స్పాట్ సిల్వర్ సుమారు 63.79 డాలర్ల వద్ద ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మూడు వారాలకు పైగా కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
సాధారణంగా మార్కెట్లలో అనిశ్చితి పెరిగినప్పుడు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా మదుపర్లు భావిస్తుంటారు. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురైనప్పుడు, ఆర్థిక మాంద్యం లేదా ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగినప్పుడు పుత్తడికి డిమాండ్ పెరగడం సాధారణం. అంతేకాకుండా భారత్‌లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగల సమయంలో ఆభరణాల కోసం బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం శ్రావణమాసం సమయం.. దీంతో బంగారం ధర పెరేగాలి. కానీ.. అందుకు భిన్నంగా ఉంది.
ప్రస్తుతం బంగారం ధరలపై ఒకేసారి పలు అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు మొదలయ్యాయి. దాంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందన్న అంచనాలు బలపడుతున్నాయి.
వెండి విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. బంగారం మాదిరిగా పెట్టుబడి సాధనంగా ఉపయోగించడంతో పాటు.. వెండికి పారిశ్రామిక రంగంలో కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ వంటి పరిశ్రమల్లో వెండిని ఉపయోగిస్తారు. అందువల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు పెరిగినప్పుడు వెండి ధరపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో వెండి కూడా నష్టాలను చవిచూసినట్లు మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి.
అయితే బంగారం ధర తగ్గిందని ఒక్కసారిగా మొత్తం డబ్బును పెట్టుబడి పెట్టడం కంటే.. తమ అవసరం, పెట్టుబడి లక్ష్యం, రిస్క్‌ను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆభరణాల కోసం కొనుగోలు చేసేవారు ధరలలో మరింత మార్పు వచ్చే అవకాశాన్ని గమనించవచ్చు. పెట్టుబడి కోణంలో చూసేవారు ఒకేసారి కాకుండా దశలవారీగా పెట్టుబడి పెట్టే విధానాన్ని పరిశీలించవచ్చు. అయితే బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ పరిణామాలకు వేగంగా స్పందిస్తాయి కాబట్టి స్వల్పకాలికంగా లాభాలు ఖచ్చితమని చెప్పలేం.





