Thursday, March 19, 2026

‘పరాభవ‘ అంటే ఓటమి కాదు.. అసలైన అర్థం ఇదే…

తెలుగు పంచాంగం ప్రకారం ప్రారంభమవుతున్న శ్రీ పరాభవ నామ సంవత్సరం పేరు వినగానే చాలామందిలో ఒక సందేహం కలుగుతుంది. సాధారణ అర్థంలో పరాభవం అంటే అవమానం, ఓటమి, అపజయం అని భావిస్తారు. దీంతో ఈ సంవత్సరం అంతా ఇబ్బందులు, ప్రతికూలతలే ఉంటాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పండితులు మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన ఆధ్యాత్మిక అర్థాన్ని వివరిస్తున్నారు.

వారి ప్రకారం, సంవత్సర నామంలో ఉన్న పదానికి నేరుగా భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. పరాభవం అనేది వ్యక్తి జీవితంలో జరిగే బాహ్య అపజయాలను సూచించేదిగా కాకుండా, మనలోని చెడు స్వభావాలపై సాధించాల్సిన అంతర్ముఖ విజయాన్ని సూచిస్తుందని వివరించుతున్నారు. ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనే అరిషడ్వర్గాలను జయించి, ధర్మబద్ధంగా కష్టపడేవారికి ఈ సంవత్సరం విజయాలు అందిస్తుందని విశ్లేషిస్తున్నారు.

పండితుల వివరణలో ‘పరా’ అంటే అమ్మవారు, పరాశక్తి అని అర్థం. ‘భవ’ అంటే ఉండు, ఆవిర్భావం, లేదా శివతత్వం అని భావిస్తారు. ఈ రెండు పదాలు కలిపి ‘పరాభవ’ అంటే అమ్మవారికి సమీపంగా ఉండటం, పరాశక్తి ఆవిర్భావం, లేదా అర్ధనారీశ్వర తత్వానికి సంకేతం అని చెబుతున్నారు. అంటే శక్తి-శివ తత్వాల సమన్వయం ద్వారా జీవితం సాఫల్యంగా సాగుతుందనే సంకేతాన్ని ఈ నామ సంవత్సరం ఇస్తోందని అభిప్రాయపడుతున్నారు.

ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే ఈ సంవత్సరం మనలోని లోపాలను గుర్తించి సరిదిద్దుకునే సమయం అని పండితులు సూచిస్తున్నారు. బాహ్య ప్రపంచంలో పోటీలు, ఒత్తిడులు ఉన్నా, మనస్సులో స్థిరత్వం, నియంత్రణ, ధర్మబద్ధత ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నారు.

జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పరాభవ నామ సంవత్సరం మనిషి ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని సూచిస్తుంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని, వినయం, క్రమశిక్షణ, ఆత్మపరిశీలనతో ముందుకు సాగితే మంచి ఫలితాలు దక్కుతాయని చెబుతున్నారు.

ఇక ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణంలో కూడా ఇదే సందేశం ప్రధానంగా వినిపిస్తోంది. కొత్త సంవత్సరాన్ని భయంతో కాకుండా, ఆత్మవిశ్వాసంతో స్వాగతించాలనే సందేశాన్ని శ్రీ పరాభవ నామ సంవత్సరం అందిస్తోందని పండితులు స్పష్టం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News