దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరా ఆలస్యం కావడంతో చాలా కుటుంబాలు రోజువారీ వంటలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సిలిండర్ బుక్ చేసిన తర్వాత కూడా డెలివరీకి ఎక్కువ సమయం పడుతుండటంతో, ముఖ్యంగా ఉద్యోగస్తులు, చిన్న కుటుంబాలు, విద్యార్థులు ప్రత్యామ్నాయ ఆహారాలపై ఆధారపడుతున్నారు. ఫలితంగా రెడీ-టు-ఈట్, ఇన్‌స్టంట్ ఫుడ్ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
ఇంట్లో గ్యాస్ ఉంటే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం రకరకాల ఆహార ఉత్పత్తులను తయారు చేసుకునేవారు. కానీ ఇప్పుడు గ్యాస్ సేవ్ చేయడానికి బ్రేక్ ఫాస్ట్ లో కొత్త మెనూ చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇన్‌స్టంట్ నూడుల్స్, ఉప్మా మిక్స్, రెడీ-టు-ఈట్, రెడీ-టు-కుక్ ఫుడ్స్, ఫ్రోజెన్ స్నాక్స్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రకమైన ఆహార ఉత్పత్తుల సేల్స్ 10 నుంచి 20 శాతం పెరిగాయి. సూపర్ మార్కెట్లలో, ఈ-కామర్స్ వంటి సంస్థలైన బ్లింకిట్, జెప్టో వంటి సంస్థల్లో స్టాక్ వేగంగా ఖాళీ అవుతున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. అటు ఇండక్షన్ స్టవ్‌లకు కూడా డిమాండ్ పెరిగింది. రెస్టారెంట్లు మెనూ పరిమితం చేసి, ఫుడ్ డెలివరీ వర్కర్ల ఆదాయాలు సగం తగ్గాయి.
అయితే వైద్య నిపుణులు మాత్రం జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇన్‌స్టంట్ ఫుడ్స్‌లో ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీటిని తాత్కాలిక పరిష్కారంగా మాత్రమే ఉపయోగించాలంటున్నారు. వీలైనంత వరకు పండ్లు, మొలకలు, పెరుగు, శాండ్‌విచ్‌లు వంటి తక్కువ వంటతో సిద్ధమయ్యే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు వినియోగదారులు తక్కువ గ్యాస్‌తో వంట పూర్తయ్యే ఆహార పద్ధతులను ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రెషర్ కుక్కర్ వినియోగం, ముందుగా నానబెట్టిన ధాన్యాలతో వంట, ఒకేసారి రెండు పదార్థాలు సిద్ధం చేయడం వంటి పద్ధతులు గ్యాస్ ఆదాకు తోడ్పడతాయని సూచిస్తున్నారు.





