Tuesday, September 15, 2026

Parag Shah BJP MLA: కోట్ల ఆస్తులు కలిగిన ఎమ్మెల్యే యాచకుడిగా… ఎందుకో తెలుసా?

Parag Shah BJP MLA : ముంబైలో బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా యాచకుడిగా మారిపోయాడు. కోట్లాది రూపాయల ఆస్తులు కలిగిన ఆయన.. ఒక్కరోజు తన హోదా, భద్రత, ఖరీదైన వాహనాలు, సౌకర్యాలున్నా… ఆయన ఇలా ఎందుకు మారాడన్న విషయం కొంతమందికి అర్థం కావడం లేదు. అసలు ఈ వేషం వేయడానికి కారణం ఏంటో తెలుసా?

ఎమ్మెల్యే ఆస్తులు ఇవే..
మహారాష్ట్రలోని ముంబై ఘాట్‌కోపర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం మొత్తం ఆస్తుల విలువ రూ.3,383.06 కోట్లుగా ఉంది. ఇందులో సుమారు రూ.3,315.52 కోట్ల విలువైన చరాస్తులు, రూ.67.53 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వివరాలు చెబుతున్నాయి.ఈ ఆస్తుల వివరాల కారణంగా 2024 ఎన్నికల్లో పరాగ్ షా మహారాష్ట్రలోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు.

ఎందుకు బిచ్చగాడిగా మారారు?
సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు భద్రతా సిబ్బంది, వాహనాలు, అనుచరులతో కనిపిస్తారు. కానీ పరాగ్ షా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరించారు. జైన ఆధ్యాత్మిక గురువు నమ్రముని మహారాజ్ సూచన మేరకు ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. తనకు ఉన్న హోదా, సంపద, సౌకర్యాలను పక్కనపెట్టి.. సామాన్యులు, ముఖ్యంగా నిరుపేదలు ఎదుర్కొనే జీవితాన్ని స్వయంగా అనుభవించాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఘాట్‌కోపర్ వీధుల్లో భిక్షాటన
పరాగ్ షా ముంబైలోని ఘాట్‌కోపర్ ప్రాంతంలో బిచ్చగాడి వేషంలో కనిపించారు. సాధారణంగా తనను గుర్తించే ప్రజలకు తెలియకుండా వేషధారణ మార్చుకుని రోడ్డు పక్కన కూర్చున్నారు. భిక్ష అడుగుతూ కొంత సమయం గడిపారు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను ఆయన స్వయంగా పరిశీలించారు.

సమోసా ఇచ్చిన చిరు వ్యాపారి
ఈ ప్రయోగంలో తనను ఆశ్చర్యానికి గురిచేసిన అనుభవాన్ని కూడా పరాగ్ షా పంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. తనను పేద వ్యక్తిగా భావించిన ఓ చిరు వ్యాపారి డబ్బులు తీసుకోకుండా సమోసా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తనకు తెలియని వ్యక్తి పట్ల కూడా అతను చూపిన ఆప్యాయత, సహాయం తనను కదిలించిందని షా వివరిస్తున్నాడు.

ఎవరీ పరాగ్ షా?
పరాగ్ షా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వ్యాపారవేత్త. ఆయన Man Infraconstruction Ltd వ్యవస్థాపకుల్లో ఒకరుగా, వ్యాపార రంగంలో పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ఘాట్‌కోపర్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లోనూ ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన.. 2024లో మరోసారి గెలుపొందారు. ఆయన విద్యార్హత B.Com కాగా, 2024 ఎన్నికల అఫిడవిట్‌లో రూ.3,383.06 కోట్ల ఆస్తులను ప్రకటించారు.

పరాగ్ షా చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు భిన్నమైన చర్చకు దారితీసింది. ఒకవైపు కోట్లాది రూపాయల ఆస్తులు కలిగిన ఎమ్మెల్యే బిచ్చగాడి వేషంలో భిక్ష అడగడం ఆసక్తికరంగా ఉందని పలువురు అంటుండగా.. మరోవైపు నిరుపేదల జీవితాన్ని కేవలం ఒక్కరోజు అనుభవించడం ద్వారా వారి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకోవచ్చా అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News