Thursday, September 3, 2026

Postal jobs without an exam : పరీక్ష లేకుండానే 23,757 పోస్టల్ ఉద్యోగాలు

Postal jobs without an exam : దేశవ్యాప్తంగా పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ సేవక్‌ , బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ , అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘జీడీఎస్‌ ఆన్‌లైన్‌ ఎంగేజ్‌మెంట్‌ షెడ్యూల్‌–II – జూలై 2026’ కింద మొత్తం 23,757 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియా పోస్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ indiapost.gov.in/gdsonlineengagement ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ, తెలంగాణలో ఖాళీలు

మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌లో 917, తెలంగాణ సర్కిల్‌లో 419 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల పూర్తి వివరాలను సర్కిల్‌, డివిజన్‌, కార్యాలయం, పోస్టు ఐడీ, కేటగిరీ, భాష, పిన్‌కోడ్‌ వారీగా అధికారిక నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు తమకు సంబంధించిన పోస్టల్‌ డివిజన్‌, స్థానిక భాష, కేటగిరీ వారీ ఖాళీలను పరిశీలించాలి.

ముఖ్యమైన తేదీలు

ఈ నియామక ప్రక్రియలో ముందుగా వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. OTR ప్రక్రియ 2026 ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్‌ 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 2 నుంచి సెప్టెంబర్‌ 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దరఖాస్తులో తప్పులు ఉంటే సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో సవరణకు అవకాశం కల్పించారు.

ప్రక్రియ తేదీలు

వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఆగస్టు 31–సెప్టెంబర్‌ 19, 2026
దరఖాస్తు, ఫీజు చెల్లింపు సెప్టెంబర్‌ 2–21, 2026
దరఖాస్తు సవరణ సెప్టెంబర్‌ 23–24, 2026
గడువు సమయం సాయంత్రం 5 గంటల వరకు

విద్యార్హత, వయసు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతిలో గణితం, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత తప్పనిసరి. తాము దరఖాస్తు చేసుకునే పోస్టల్‌ సర్కిల్‌కు సంబంధించిన స్థానిక భాషను కనీసం పదో తరగతి వరకు చదివి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోస్టులకు స్థానిక భాషగా తెలుగు అవసరం.

అభ్యర్థుల వయసు దరఖాస్తుల చివరి తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 40 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠ వయసులో ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూడీ–ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ–ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉండదు.

పరీక్ష లేకుండానే ఎంపిక

జీడీఎస్‌ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా కంప్యూటర్‌ రూపొందించే మెరిట్‌ జాబితా ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. పదో తరగతి మార్కులను శాతంగా లెక్కించి, నాలుగు దశాంశాల వరకు పరిగణనలోకి తీసుకుంటారు.

మార్కుల స్థానంలో గ్రేడ్‌లు లేదా గ్రేడ్‌ పాయింట్లు ఉన్న అభ్యర్థుల మార్కులను నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా లెక్కిస్తారు. సాధారణంగా గ్రేడ్‌ పాయింట్‌ను 9.5తో గుణించి మార్కులను నిర్ణయిస్తారు. టై ఏర్పడితే వయసులో పెద్దవారికి, ఆ తర్వాత రిజర్వేషన్‌ కేటగిరీ, లింగం తదితర ప్రాధాన్యత క్రమం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.

పోస్టుల విధులు

బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ పోస్టుకు ఎంపికైన వారు బ్రాంచ్‌ పోస్టాఫీసు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించాలి. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సేవలు, తపాలా ఉత్పత్తుల విక్రయాలు, కస్టమర్‌ సేవలు, మెయిల్‌ రవాణా, పంపిణీ వంటి బాధ్యతలు ఉంటాయి. ఎంపికైన BPM అభ్యర్థి పోస్టాఫీసు నిర్వహణకు అవసరమైన వసతిని తన ఖర్చుతో ఏర్పాటు చేయాలి. అలాగే పోస్టాఫీసు ఉన్న గ్రామంలోనే నివసించాల్సి ఉంటుంది.

అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ (ABPM)గా ఎంపికైన వారు స్టాంపులు, పోస్టల్‌ స్టేషనరీ విక్రయించడం, ఉత్తరాలు, పార్సిళ్లను ఇంటింటికీ పంపిణీ చేయడం, IPPB డిపాజిట్లు, చెల్లింపులు, ఇతర లావాదేవీలు నిర్వహించడం వంటి పనులు చేయాలి. అవసరమైనప్పుడు BPMకు సహకరించాలి. ABPMలు సంబంధిత పోస్టాఫీసు డెలివరీ పరిధిలో నివసించాల్సి ఉంటుంది.

డాక్‌ సేవక్‌ పోస్టులో ఉన్నవారు పోస్టాఫీసులు, సార్టింగ్‌ కార్యాలయాలు, మెయిల్‌ కార్యాలయాలు, డెలివరీ కేంద్రాల్లో విధులు నిర్వర్తించవచ్చు. మెయిల్‌ బ్యాగులు, పార్శిళ్ల నిర్వహణ, ఉత్తరాల పంపిణీ, IPPB సేవలు, స్టాంపుల విక్రయం, పోస్టాఫీసు కార్యకలాపాలకు సహకరించడం వంటి బాధ్యతలు ఉంటాయి.

జీతభత్యాలు

జీడీఎస్‌ ఉద్యోగులకు టైమ్‌ రిలేటెడ్‌ కంటిన్యుటీ అలవెన్స్‌ (TRCA) రూపంలో వేతనం చెల్లిస్తారు. BPMలకు ప్రారంభ TRCA శ్రేణి నెలకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు, ABPM, డాక్‌ సేవక్‌ పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు ఉంటుంది. నిబంధనల ప్రకారం సంవత్సరానికి 3 శాతం వార్షిక పెంపు, డీఏ, జీడీఎస్‌ గ్రాట్యుటీ, సర్వీస్‌ డిశ్చార్జ్‌ బెనిఫిట్‌ స్కీమ్‌ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

అయితే జీడీఎస్‌ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్‌ ఉద్యోగులు కాదని నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది. వీరి సేవా నిబంధనలు GDS Conduct and Engagement Rules, 2020 ప్రకారం ఉంటాయి. రోజుకు కనీసం నాలుగు గంటలు, గరిష్ఠంగా ఐదు గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ప్రభుత్వం చెల్లించే అలవెన్సులతో పాటు జీవనోపాధికి మరో ఆదాయ వనరు ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

దరఖాస్తు విధానం

  • అధికారిక వెబ్‌సైట్‌ indiapost.gov.in/gdsonlineengagement ను ఓపెన్‌ చేయాలి.
  • ముందుగా ‘వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌’ ప్రక్రియను పూర్తి చేయాలి.
  • వ్యక్తిగత వివరాలు, పదో తరగతి విద్యా వివరాలు, మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ నమోదు చేయాలి.
  • అవసరమైన ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్‌ చేయాలి.
  • పోస్టల్‌ సర్కిల్‌, డివిజన్‌, పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి.
  • వర్తించే దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  • దరఖాస్తును తుది సబ్మిట్‌ చేసి, భవిష్యత్‌ అవసరాల కోసం కాపీని భద్రపరచుకోవాలి.

ధ్రువపత్రాల పరిశీలన

మెరిట్‌ జాబితాలో స్థానం పొందిన అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ ద్వారా సమాచారం అందుతుంది. అనంతరం నిర్ణీత డివిజనల్‌ లేదా యూనిట్‌ కార్యాలయంలో అసలు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి. మార్కుల జాబితా, గుర్తింపు కార్డు, పుట్టిన తేదీ ఆధారం, కుల ధ్రువపత్రం, ఈడబ్ల్యూఎస్‌ లేదా దివ్యాంగ ధ్రువపత్రం, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య ధ్రువపత్రం వంటి పత్రాలను తీసుకెళ్లాలి.

షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు సమాచారం అందిన 15 రోజుల్లో డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత 30 రోజుల్లో చేరికకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలి. పత్రాల్లో తేడాలు ఉన్నా, గడువులోపు హాజరు కాకపోయినా, అభ్యర్థిత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది.

అభ్యర్థులకు సూచనలు

దరఖాస్తు చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే OTR, అప్లికేషన్‌ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. పదో తరగతి మార్కుల జాబితాలోని వివరాలను సరిగ్గా నమోదు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేస్తే అభ్యర్థిత్వం రద్దవుతుంది. దరఖాస్తు పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, చెల్లింపు రసీదు, అప్లికేషన్‌ కాపీని భద్రపరచుకోవాలి.

ఇండియా పోస్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌, @indiapost.gov.in, @indiapostgdsonline.gov.in డొమైన్‌ల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. అనధికారిక ఫోన్‌కాల్స్‌, ఈమెయిల్స్‌, వాట్సాప్‌ సందేశాలకు వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు సమాచారం ఇవ్వకూడదని పోస్టల్‌ శాఖ హెచ్చరించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News