Monday, August 31, 2026

Good News For Students: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఆరోజు బడి బ్యాగ్‌ బాధ తప్పినట్లే..

Good News For Students:తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ తీపి కబురు చెప్పింది. ప్రతిరోజూ బరువైన పుస్తకాల బ్యాగులతో పాఠశాలకు వెళ్లే పిల్లలకు ఇక కొంత ఉపశమనం లభించనుంది. చదువు అంటే కేవలం పుస్తకాలు చదవడం, క్లాసులు వినడం, హోంవర్క్‌ చేయడం మాత్రమే కాదనే ఉద్దేశంతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ‘టెన్ బ్యాగ్‌లెస్ డేస్‌’ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.

1 నుంచి 10వ తరగతి వరకు అమలు

2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ విధానాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులపై చదువు, పుస్తకాల భారం తగ్గించడంతో పాటు.. బడిలో నేర్చుకునే ప్రక్రియను మరింత ఆసక్తికరంగా, ఆనందదాయకంగా మార్చడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.

ఏడాదిలో 10 రోజులు.. పుస్తకాలు లేకుండానే బడికి!

అకడమిక్ క్యాలెండర్‌ ప్రకారం 2026–27 విద్యా సంవత్సరంలో మొత్తం 10 రోజులను ‘నో బ్యాగ్‌ డేస్‌’గా నిర్వహించనున్నారు. సాధారణంగా ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ రోజుల్లో విద్యార్థులు పుస్తకాల బ్యాగులు లేకుండానే పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.

విద్యాశాఖ ఇప్పటికే కొన్ని తేదీలను ప్రకటించింది. 2026లో సెప్టెంబర్‌ 19, నవంబర్‌ 21, డిసెంబర్‌ 19 తేదీల్లో, 2027లో ఫిబ్రవరి 20, మార్చి 20 తేదీల్లో ‘బ్యాగ్‌లెస్ డే’ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మిగిలిన రోజులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించి కార్యక్రమాలు చేపట్టాలని పాఠశాలలకు సూచించారు.

ఆ రోజు చదువు కాదు.. కొత్తగా నేర్చుకోవడమే!

బ్యాగ్‌ లేని రోజుల్లో సాధారణ తరగతులకు భిన్నంగా ప్రత్యేకంగా రూపొందించిన మాడ్యూల్స్‌ ఆధారంగా విద్యార్థులకు బోధన చేపట్టనున్నారు. పుస్తకాల్లోని పాఠాలను కంఠస్థం చేయించడం కంటే.. స్వయంగా అనుభవించడం, పరిశీలించడం, ఆలోచించడం ద్వారా విషయాలను నేర్చుకునేలా కార్యక్రమాలను రూపొందించనున్నారు.

విహారయాత్రలు.. క్విజ్‌లు.. సైన్స్‌ ప్రయోగాలు

ఈ ప్రత్యేక రోజుల్లో విద్యార్థులకు విభిన్న సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విహారయాత్రలు, క్విజ్‌లు, బాలసభలు, చిత్రలేఖనం, నాటికలు, సైన్స్‌ ప్రయోగాలు వంటి కార్యక్రమాలతో పిల్లల్లో ఆసక్తిని పెంచనున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న చేతివృత్తుల నిపుణులతో విద్యార్థులకు నేరుగా పరిచయం కల్పించి.. వారి పనితీరు, నైపుణ్యాలు, సంప్రదాయ వృత్తుల గురించి తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు.

పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభకు పదును

ఈ విధానం ద్వారా విద్యార్థుల్లో కేవలం పాఠ్యాంశాలకు సంబంధించిన పరిజ్ఞానం మాత్రమే కాకుండా.. పరిశీలనా శక్తి, ఆచరణాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని విద్యాశాఖ భావిస్తోంది. తరగతి గదికి పరిమితమైన విద్యను బయట ప్రపంచంతో అనుసంధానం చేయడం ద్వారా పిల్లల్లో కొత్త ఆలోచనలు, కొత్త ఆసక్తులు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

మొత్తంగా ‘టెన్ బ్యాగ్‌లెస్ డేస్‌’తో ప్రభుత్వ పాఠశాలల్లో చదువు విధానంలో కొత్త మార్పు రానుంది. పుస్తకాల భారాన్ని కొంత తగ్గించడంతో పాటు.. పిల్లలకు ఆటపాటలు, ప్రయోగాలు, కళలు, స్థానిక వృత్తుల పరిచయం వంటి అనుభవాత్మక విద్యను అందించడం ద్వారా బడి అంటే భయం కాకుండా.. ఆసక్తితో వచ్చే వాతావరణాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా కనిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News