Bike Ambulance in India:అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదిలో అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా బైక్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రహదారి సౌకర్యాలు తక్కువగా ఉన్న గ్రామీణ, కొండ, అటవీ, మారుమూల ప్రాంతాల్లో ప్రమాదాలు లేదా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో రోగులకు తక్షణ వైద్యసాయం అందించడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశం. ఇవి ఎలా పనిచేస్తాయంటే?
బైక్ అంబులెన్స్‌ల అమలుకు వీలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లో సవరణలు ప్రతిపాదిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సవరణల ద్వారా బైక్ అంబులెన్స్‌లను ప్రత్యేక అత్యవసర వాహనాలుగా గుర్తించే విధానంతో పాటు వాటి రిజిస్ట్రేషన్, వినియోగంపై స్పష్టమైన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
బైక్ అంబులెన్స్‌ల కోసం ప్రత్యేక సాంకేతిక ప్రమాణాలను ప్రభుత్వం రూపొందించనుంది. వీటి డిజైన్ ఎలా ఉండాలి? అత్యవసర వైద్య పరికరాలు ఏవి ఉండాలి? రిజిస్ట్రేషన్ విధానం ఎలా ఉండాలి? వాహనాల తనిఖీలు, నిర్వహణ, ఆపరేషన్ ఎలా జరగాలి? వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురానున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఒకే తరహా ప్రమాణాలతో బైక్ అంబులెన్స్‌లు సేవలందించే అవకాశం ఉంటుంది.
కొండ ప్రాంతాలు, ఇరుకైన వీధులు, వరదలు లేదా ప్రకృతి విపత్తుల సమయంలో సాధారణ అంబులెన్స్‌లు చేరుకోలేని పరిస్థితులు తరచుగా ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో బైక్ అంబులెన్స్‌లు సులభంగా ప్రయాణించి, బాధితులకు వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో ప్రమాద బాధితులకు లేదా తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి మొదటి దశ వైద్య సహాయం త్వరగా అందే అవకాశాలు పెరుగుతాయి.
ఈ వాహనాల్లో ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) కిట్, ఆక్సిజన్ సిలిండర్, ప్రాథమిక ప్రాణరక్షక పరికరాలు, అత్యవసర మందులు, కమ్యూనికేషన్ వ్యవస్థ వంటి అవసరమైన సామగ్రిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వీటిని శిక్షణ పొందిన అత్యవసర వైద్య సిబ్బంది లేదా పారామెడిక్స్ నిర్వహించేలా నిబంధనలు రూపొందించే అవకాశం ఉంది.
ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటను వైద్యులు ‘గోల్డెన్ అవర్’ గా పేర్కొంటారు. ఈ సమయంలో చికిత్స అందితే ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. బైక్ అంబులెన్స్‌లు ఈ కీలక సమయంలో బాధితుల వద్దకు వేగంగా చేరుకుని ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు అవసరమైతే పెద్ద అంబులెన్స్ వచ్చే వరకు పరిస్థితిని అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషించగలవు.
కేంద్రం రూపొందించే నిబంధనల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు, అత్యవసర వైద్య సేవల సంస్థలు బైక్ అంబులెన్స్‌లను తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ఆరోగ్య సేవలు, 108 వంటి అత్యవసర సేవలకు ఇవి అనుబంధంగా పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.





