VB-GRAMG: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి రంగంలో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)’ (VB-G RAM G) చట్టాన్ని 2026 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తోంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
VB-G RAM G అంటే ఏమిటి?
VB-G RAM G అంటే Viksit Bharat – Guarantee for Rozgar and Ajeevika Mission (Gramin). గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఉపాధి, ఆదాయ భద్రత కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ కొత్త చట్టం లక్ష్యం. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
100 రోజుల బదులు 125 రోజుల ఉపాధి
ఈ పథకంలోని ప్రధాన ఆకర్షణ గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధి హామీ కల్పించడం. ఇప్పటివరకు ఎంజీఎన్‌రేగా కింద 100 రోజుల పని మాత్రమే ఉండగా, కొత్త చట్టంలో అదనంగా 25 రోజులు పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్‌స్కిల్డ్ శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి కుటుంబానికి ఈ హామీ వర్తిస్తుంది.
MGNREGA: ‘ఉపాధి హామీ’లో కీలక మార్పులు.. జూలై నుంచే అమలు – insightearth.in – Telugu News Portal
పని ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి
ఉపాధి కోసం దరఖాస్తు చేసిన వారికి నిర్ణీత గడువులోపు పని కల్పించాల్సి ఉంటుంది. ఒకవేళ అధికారులు పని ఇవ్వడంలో విఫలమైతే, చట్టంలోని నిబంధనల ప్రకారం సంబంధిత లబ్ధిదారులకు నిరుద్యోగ భృతి చెల్లించే హక్కు ఉంటుంది. దీంతో గ్రామీణ కార్మికులకు మరింత చట్టపరమైన రక్షణ లభిస్తుంది.
వేతనాలు నేరుగా ఖాతాల్లోకి
ఈ పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. కూలీలకు చెల్లించాల్సిన వేతనాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతాల్లో జమ చేస్తారు. వారానికి ఒకసారి లేదా మస్టర్ రోల్ ముగిసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలి. ఆలస్యమైతే పరిహారం కూడా చెల్లించే నిబంధన ఉంది.

పాత జాబ్ కార్డులే కొనసాగుతాయి
కొత్త పథకం అమల్లోకి వచ్చిన వెంటనే కొత్త కార్డులు అవసరం ఉండదు. ప్రస్తుతం ఉన్న e-KYC ధృవీకరించిన MGNREGA జాబ్ కార్డులే కొత్త గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డులు జారీ అయ్యే వరకు చెల్లుబాటు అవుతాయి. e-KYC పెండింగ్‌లో ఉన్న వారికీ ఉపాధి నిరాకరించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. జాబ్ కార్డు లేని కొత్త కార్మికులు గ్రామ పంచాయతీ వద్ద నమోదు చేసుకోవచ్చు.
పాత పనులకు అంతరాయం ఉండదు
జూన్ 30 వరకు కొనసాగుతున్న అన్ని MGNREGA పనులు యథావిధిగా కొనసాగుతాయి. ఆ తర్వాత అవే పనులను కొత్త VB-G RAM G వ్యవస్థలోకి మార్చనున్నారు. దీంతో ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనులు లేదా కార్మికుల ఉపాధికి ఎలాంటి అంతరాయం ఉండదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
రికార్డు స్థాయిలో బడ్జెట్
ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.95,692.31 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. రాష్ట్రాల వాటాతో కలిపి మొత్తం వ్యయం రూ.1.51 లక్షల కోట్లకు మించే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ ఉపాధి కార్యక్రమాల చరిత్రలో ఇది అత్యధిక బడ్జెట్ కేటాయింపుగా పేర్కొంది.
గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ
VB-G RAM G పథకం ద్వారా ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ కుటుంబాల ఆదాయ భద్రత, స్వయం సమృద్ధి గ్రామాల నిర్మాణం వంటి లక్ష్యాలను ప్రభుత్వం ముందుంచింది. గ్రామ పంచాయతీలను అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతూ, గ్రామీణ భారతాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.





