Sunday, May 24, 2026

MGNREGA: ‘ఉపాధి హామీ’లో కీలక మార్పులు.. జూలై నుంచే అమలు

MGNREGA: దేశవ్యాప్తంగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ ఎంప్లాయిమెంట్ అండ్ లైవ్లీహుడ్ మిషన్ (గ్రామీణ)’ అనే కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దీనిని సంక్షిప్తంగా ‘VB-GRAM G’ లేదా ‘G RAM G’గా పిలుస్తున్నారు. ఈ కొత్త చట్టం జూలై 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.

ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల పని గ్యారెంటీ ఉండేది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పరిమితిని 125 రోజులుగా పెంచుతున్నారు. దీంతో గ్రామీణ పేదలకు అదనంగా 25 రోజుల ఉపాధి లభించనుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

కొత్త చట్టంలో వేతనాల చెల్లింపుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్మికులకు సమయానికి డబ్బులు అందకపోవడం పై గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కొత్త వ్యవస్థలో వేతనాలు ఆలస్యమైతే కార్మికులకు పరిహారం చెల్లించే విధానాన్ని మరింత కఠినతరం చేశారు. దీనివల్ల కూలీలకు సమయానికి జీతాలు అందే అవకాశాలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే కొనసాగుతున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ పనులను మాత్రం ఆపబోమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న చెరువుల తవ్వకం, రోడ్లు, నీటి సంరక్షణ, కాలువల అభివృద్ధి వంటి పనులు యథావిధిగా కొనసాగుతాయి. అయితే కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పనుల పర్యవేక్షణ, నిధుల విడుదల, కార్మికుల హాజరు నమోదు వంటి అంశాల్లో సాంకేతిక మార్పులు తీసుకురానున్నారు.

ఈ కొత్త చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లో కేవలం కూలి పనులకే కాకుండా జీవనోపాధి అవకాశాలపై కూడా దృష్టి పెట్టనున్నారు. గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి, చిన్న స్థాయి ఆదాయ వనరులు, వ్యవసాయ అనుబంధ పనులకు ప్రోత్సాహం వంటి అంశాలను కూడా చేర్చే అవకాశముందని సమాచారం. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కేంద్రం భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే గ్రామసభల ద్వారా ప్రజలకు ఈ కొత్త చట్టంపై అవగాహన కల్పిస్తున్నారు. పని దినాలు పెరగడంతో ఒక్కో కుటుంబానికి వేల రూపాయల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వేతనాల ప్రకారం చూస్తే, అదనంగా వచ్చే 25 రోజుల పనితో కుటుంబానికి సుమారు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు అదనపు లాభం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News