Friday, May 22, 2026

Amchur Mistaken for Dru*g: మామిడి పొడిని డ్రగ్స్ అనుకున్నారు.. ఆ తరువాత అతని జీవితం..?

Amchur Mistaken for Dru*g: ఒక చిన్న అనుమానం… ఒక నిర్లక్ష్య నిర్ణయం… ఒక నిర్దోషి జీవితాన్ని ఏ స్థాయిలో దెబ్బతీస్తుందో చూపించే ఘటన ఇది. వంద మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు.. అని పెద్దలు చెప్పారు. అయినా కూడా కొందరు అధికారులు చేసే పొరపాట్లతో అమాయకుల బలి అవుతున్నారు. అలాంటి వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉన్నారు. ఇతని బ్యాగులో దొరికిన ఓ పౌడర్ ను డ్రగ్స్ గా భావించి అరెస్ట్ చేశారు. కానీ అది మామిడి పౌడర్ అని తేలింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌కు చెందిన అజయ్ సింగ్ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఈయన ఉద్యోగ పనిమీద ఢిల్లీ వెళ్లేందుకు భోపాల్‌లోని రాజా భోజ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. భద్రతా తనిఖీల సమయంలో ఆయన బ్యాగులో ఉన్న తెల్లటి పొడిని చూసిన అధికారులు అది మాదకద్రవ్యమని అనుమానించారు. అజయ్ సింగ్ అది సాధారణ మామిడికాయ పొడి అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వెంటనే NDPS చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఒక్క అనుమానం కారణంగా అజయ్ సింగ్ జీవితం ఒక్కసారిగా చీకటిలోకి వెళ్లిపోయింది. సమాజంలో అవమానం, కుటుంబంలో ఆందోళన, ఉద్యోగ భవిష్యత్తుపై అనిశ్చితి ఇవన్నీ ఆయనను వెంటాడాయి. అత్యంత కఠినమైన NDPS చట్టం కింద కేసు నమోదవడంతో బెయిల్ కూడా సులభం కాలేదు. ఫలితంగా ఆయన 57 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది.

తర్వాత ఫోరెన్సిక్ పరీక్షల్లో అసలు నిజం బయటపడింది. అది ఎలాంటి డ్రగ్స్ కాదని, సాధారణ మామిడికాయ పొడేనని అధికారులు నిర్ధారించారు. దీంతో అజయ్ సింగ్ నిర్దోషి అని తేలింది. కానీ అప్పటికే ఆయన అనుభవించిన మానసిక వేదన, కోల్పోయిన గౌరవం, కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు తిరిగి రాలేనివిగా మారాయి.

ఈ ఘటనపై అజయ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సరైన ధృవీకరణ లేకుండా ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల కారణంగా ఒక నిర్దోషి జీవితమే దెబ్బతిందని పేర్కొంటూ ₹10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఈ కేసు కేవలం ఒక వ్యక్తి న్యాయపోరాటం మాత్రమే కాదు… అధికార వ్యవస్థ ఎంత బాధ్యతగా వ్యవహరించాలనే విషయంపై పెద్ద హెచ్చరిక కూడా. అనుమానం వచ్చిన ప్రతి సందర్భంలో తొందరపడి చర్యలు తీసుకోవడం కంటే, నిజానిజాలు నిర్ధారించుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన స్పష్టంగా చెబుతోంది.

“న్యాయం ఆలస్యమైనా… చివరకు గెలుస్తుంది” అనే మాటకు అజయ్ సింగ్ కేసు మరో ఉదాహరణగా నిలిచింది. కానీ ఒక నిర్దోషి కోల్పోయిన 57 రోజుల స్వేచ్ఛను… 16 ఏళ్ల మానసిక వేదనను… ఏ పరిహారం పూర్తిగా భర్తీ చేయలేదనే వాస్తవం మాత్రం సమాజాన్ని ఆలోచింపజేస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News