భనవ నిర్మాణం, రోడ్డు పనుల్లో తవ్వకాలను ఒకప్పుడు మనుషులు చేసేవారు. కానీ యాంత్రీకరణలో భాగంగా ఇప్పుడు ఎక్కుడా JCB(ఎక్స్ కావేటర్) పేరు ఎక్కువగా వినిపిస్తుంది. JCB అనే పేరు యంత్రానికి కాదు. అది ఒక బ్రాండ్ పేరు. బ్రాండ్ ఎంతో ప్రాచుర్యం పొందడంతో, తర్వాత అన్ని రకాల డిగ్గర్లు, బ్యాక్‌హో లోడర్లు, ఎక్స్‌కావేటర్లకూ అదే పేరు సాధారణంగా వాడుకలోకి వచ్చింది. అసలు JCB అంటే ఏమిటీ? ఇది ఎప్పుడు ప్రారంభమైంది?
JCB ఫుల్ ఫామ్..
JCB యొక్క పూర్తి పేరు Joseph Cyril Bamford Excavators Ltd. ఈ సంస్థను Joseph Cyril Bamford 1945లో ఇంగ్లాండ్‌లో స్థాపించారు. కంపెనీ పేరు ఆయన పేరులోని మొదటి అక్షరాల నుంచే వచ్చింది:
J = Joseph
C = Cyril
B = Bamford
ఎలా ప్రారంభమైంది?
1945లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యంత్రాల కొరత ఉన్న సమయంలో జోసెఫ్ బామ్‌ఫోర్డ్ చిన్న గ్యారేజీలో మొదట ఒక టిప్పింగ్ ట్రైలర్ తయారు చేశారు. అదే JCB కంపెనీకి తొలి ఉత్పత్తి. ఆ తర్వాత వ్యవసాయం, నిర్మాణ రంగాలకు ఉపయోగపడే భారీ యంత్రాల తయారీలోకి అడుగుపెట్టారు.
ఎక్స్‌కవేటర్‌కు JCB పేరు ఎందుకు ప్రసిద్ధి అయింది?
1953లో JCB తన మొదటి బ్యాక్‌హో లోడర్ తయారు చేసింది. ఇది ముందు భాగంలో లోడర్, వెనుక భాగంలో తవ్వే చేతి భాగం కలిగిన యంత్రం. ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి నిర్మాణ పనుల్లో కనిపించే పసుపు రంగు యంత్రం అంటే JCB అనే గుర్తింపు ఏర్పడింది.
పసుపు రంగు ప్రత్యేకత..
JCB యంత్రాలు మొదట్లో వేరే రంగుల్లో ఉండేవి. కానీ తర్వాత పసుపు రంగు వాడటం ప్రారంభించింది. పనిస్థలాల్లో దూరం నుంచే కనిపించేందుకు ఈ రంగు బాగా ఉపయోగపడింది. ఈ రంగే బ్రాండ్ గుర్తింపుగా మారింది.
భారతదేశంలో ఎందుకు అన్ని యంత్రాలకూ JCB అని అంటున్నారు?
భారతదేశంలో JCB కంపెనీ చాలా తొందరగా మార్కెట్‌లోకి వచ్చింది. ముఖ్యంగా రోడ్లు, భవనాలు, కాల్వలు, ప్రభుత్వ పనుల్లో ఎక్కువగా JCB యంత్రాలే కనిపించడంతో ఏ కంపెనీ ఎక్స్‌కవేటర్ అయినా JCB అని పిలవడం మొదలైంది
కొన్ని ప్రాంతాల్లో పోక్లైన్ అనే మరో బ్రాండ్ పేరు కూడా సాధారణ పదంగా మారింది
ప్రస్తుతం JCB ఎంత పెద్ద సంస్థ?
ఇప్పుడు JCB ప్రపంచవ్యాప్తంగా 150కిపైగా దేశాల్లో యంత్రాలు విక్రయిస్తోంది. 300కిపైగా రకాల భారీ యంత్రాలు తయారు చేస్తోంది. ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లు,టెలీహ్యాండ్లర్లు,డీజిల్ ఇంజిన్లను తయారు చేస్తోంది. భారతదేశంలో కూడా JCBకు పెద్ద తయారీ యూనిట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ సమీపంలోని ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్‌హో లోడర్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.





