కేంద్ర ప్రభుత్వానికి చెందిన VAHAN పోర్టల్‌లో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 23 నుంచి పూర్తిగా ఇంటిగ్రేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మార్చి 15నుంచి ఇది అమల్లోకి వస్తుందని భావించారు. కానీ 23 నుంచి పూర్తిగా ఆన్ లైన్ లోనే సేవలు పొందే అవకాశం ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర వాహనదారులకు పెద్ద మార్పుగా భావిస్తున్నారు ఇప్పటివరకు కొత్త వాహనం కొనుగోలు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ నుంచి తదితరల సేవల కోసం ట్రాన్స్ పోర్టు కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు Vahan పోర్టల్ తో ఎక్కువ భాగం సేవలు ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో పొందే అవకాశం ఉంటుంది.
వాహన్ పోర్టల్ అనేది కేంద్ర భారత ప్రభుత్వ రోడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ ద్వారా అభివృద్ధి చేయబడిన డిజిటల్ ప్లాట్‌ఫాం. ఇది వాహనాల జాతీయ రిజిస్టర్ (VAHAN)గా పనిచేస్తూ, దేశవ్యాప్తంగా వాహన రిజిస్ట్రేషన్లు, RC సర్వీసెస్, ట్యాక్స్ చెల్లింపులు, హైపోథెకేషన్ వంటి సేవలను https://vahan.parivahan.gov.in. వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందిస్తుంది. ఈ పోర్టల్ ‘ఒక దేశం, ఒకే రిజిస్ట్రీ’ నినాదంతో పనిచేస్తుంది, ఇతర రాష్ట్రాల్లోని వాహనాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది NIC (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) ద్వారా నడుస్తూ, డ్రైవర్ల లైసెన్స్ సేవలకు సారథి పోర్టల్‌తో ముడిపడి ఉంటుంది. వాహన చోరీలు, ప్రమాదాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో క్షణాల్లో సమాచారం అందించి మోసాలను నివారిస్తుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌లుగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది.

‘వాహన్’ ద్వారా ఎటువంటి సేవలు పొందవచ్చు?
కొత్త వాహన రిజిస్ట్రేషన్
వాహనం యజమాని పేరు మార్పు
అడ్రస్ మార్పు
RC డూప్లికేట్ పొందడం
హైపోతెకేషన్ (తాకట్టు) ఎంట్రీ
హైపోతెకేషన్ తొలగింపు
NOC అప్లికేషన్
ఫిట్‌నెస్, పర్మిట్ సంబంధిత కొన్ని సేవలు
వీటి కోసం ఒకప్పుడు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేంది? కానీ ఇక నుంచి ఆన్ లైన్ లోనే చేసుకోవచ్చు.
తెలంగాణలో RTA సేవల్లో పెద్ద మార్పు ..
తెలంగాణలో వాహనదారులకు కీలక మార్పు రానుంది. ఈ మార్పుతో పారదర్శకత పెరగడం, మధ్యవర్తుల పాత్ర తగ్గడం, సమయం ఆదా కావడం ప్రధాన లాభాలుగా భావిస్తున్నారు . అప్లికేషన్ ఎక్కడ పెండింగ్‌లో ఉందో ఆన్‌లైన్‌లోనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా ఒకే డేటాబేస్‌లో వాహన వివరాలు నమోదు కావడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కూడా వాహన వివరాలు సులభంగా అందుబాటులో ఉంటాయి.
మరో ముఖ్యమైన మార్పు రెండో వాహనం కొనుగోలు చేసే వారికి ఉపశమనం కలిగించనుంది. ఇప్పటివరకు ఒక వ్యక్తి పేరుపై ఇప్పటికే వాహనం ఉండి మరో వాహనం కొనుగోలు చేస్తే అదనంగా 2 శాతం లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అదనపు భారాన్ని తొలగించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వాహనదారులకు ప్రయోజనకరం.
జాగ్రత్తలు అవసరం..
అయితే, ఈ కొత్త విధానంలో కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్, మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాలు సరైనవిగా నమోదు చేయాలి. RC, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి పత్రాలు స్పష్టంగా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. తప్పు వివరాలు ఇస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
అలాగే OTPలు, పాస్‌వర్డ్‌లు ఇతరులతో పంచుకోవద్దు. అధికారిక వెబ్‌సైట్ ద్వారానే సేవలు పొందాలి. సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఈ మార్పుతో తెలంగాణలో రవాణా సేవలు మరింత వేగవంతం, సులభతరం కానున్నాయి. భవిష్యత్తులో Sarathi సేవలతో కలిపి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ అన్నీ ఒకే డిజిటల్ వ్యవస్థలోకి వచ్చే అవకాశముంది.





