హోలీ పండుగ చేసుకోవడానికి అందరూ రెడీ అవుతున్నారు. 2025 మార్చి 14న హోలీ పౌర్ణమి రాబోతుంది. హోలీ అనగానే మార్కెట్లోకి వెళ్లి కొన్ని రంగులు తీసుకొచ్చి వేడుక నిర్వహించుకుంటారు. మరికొందరు ఆయిల్ తో హోలీని జరుపుకుంటారు. ఇంకొందరు కోడిగుడ్లు, టమాటాలతో ఈ వేడుకలో పాల్గొంటారు. అయితే హోలీ వేడుక ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఇందులో జాగ్రత్తలు తీసుకుపోతే అంతే కష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. హోలీ రోజు ఆనందమయం కావాలంటే సాంప్రదాయ రంగులు వాడడం మంచిదని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే రంగులు కూడా కల్తీమయం అయ్యాయి. దీంతో ఇంట్లోనే కొన్ని సహజరంగులను తయారు చేసుకొని హోలీ వేడుకలను నిర్వహించుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకునే హోలీ రంగులు ఏవో ఇప్పుడు చూద్దాం..
హోలీ పండుగ రోజుకు ముందు కొన్ని గులాబీ పూలను సేకరించి ఒక బిందెలో నీళ్లు పోసి ఉడికించాలి. అందులో కావలసినంత కుంకుమ పసుపు వేసి ఆ మిశ్రమాన్ని వడకట్టాలి. ఈ నీటితో హోలీ ఆడుకోవడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు.
ఇంట్లో దొరికే పసుపుతో సహజరంగులు తయారు చేసుకోవచ్చు. రెండు కప్పుల నీరు తీసుకొని అందులో మూడు లేదా నాలుగు చెంచాల పసుపును కలపండి. ఈ నీటిని గాఢంగా మరిగించిన తర్వాత ఇందులో పిండి లేదా కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేయొచ్చు. ఈ మిశ్రమాన్ని ఎండలో ఆరబెట్టాలి. మైక్రో ఓవెన్ లో పెట్టినా పొడిగా మారుతుంది. లేదా లిక్విడ్ తో కూడా ఆడుకోవచ్చు.
ఆకుపచ్చ రంగు కావాలని అనుకునేవారు వేపాకుతో సహజరంగులు తయారు చేసుకోవచ్చు. కొన్ని వేపాకులను తీసుకొని మిక్సీలో వేయాలి. ఇందులో కొద్దిగా నీరు వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును వడకట్టిన తర్వాత వచ్చిన నీరును బియ్యపు పిండి తో కలపాలి. ఈ కలిపిన దాన్ని రెండు రోజులు ఆరబెట్టి ఆ తర్వాత ఈ పౌడర్ హోలీ ఆడుకోవచ్చు. లేదా మైక్రో ఓవెన్ లో పెట్టినా పొడిగా మారుతుంది.
నీలిరంగు కావాలని అనుకునేవారు సహజమైన ఫుడ్ కలర్ ను తీసుకొని ఇందులో బియ్యపు పిండి నీ మిక్స్ చేయాలి మీ మిశ్రమాన్ని ఎండలో ఉంచి ఆరబెట్టాలి. లేదా నేరుగా లిక్విడ్ తో కూడా హోలీ ఆడుకోవచ్చు.
ఎరుపు రంగు సహజమైనది కావాలని అనుకునేవారు ఒక పాత్రలో కొంత నీరు తీసుకొని అందులో పసుపు నిమ్మరసం వేసి బాగా కలపాలి ఈ నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. దీనికి బియ్యపు పిండి వేసి మిశ్రమం చేసిన తర్వాత ఎండలో పెట్టాలి అవసరమైతే ఓవెన్ లో వేడి చేసి సహజరంగు పొందవచ్చు.
అలాగే నారింజ రంగు కోసం బంతిపూలను సేకరించాలి. వీటిని నీళ్లలో వేసి కడగాలి. ఆ తర్వాత వీటిన ఎండబెట్టి తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడితో కూడా హోలీ ఆడుకోవచ్చు.