ఉత్తర భారతదేశంలోని జౌన్సార్ బావర్ ప్రాంతం ప్రత్యేక సాంప్రదాయాలకు ప్రసిద్ధి. ఇక్కడి ప్రజలు శతాబ్దాలుగా కొన్ని ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. అలాంటి అరుదైన సంప్రదాయాల్లో ఒకటి ‘జోజోడా’ వివాహ పద్ధతి. ఈ వివాహం ఉద్దేశ్యమేంటంటే ఖర్చులను తగ్గించడం.. ఐక్యతను కాపాడడం.. ఇందులో భాగంగా ఇంట్లో ఉన్నవారందరికీ ఒకేసారి పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇటీవల ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయికి ఒకేసారి వివాహం చేశారు. అలసు ఏంటీ జోజోడా వివాహ పద్ధతి.. ఇందులో ఇంకా ఎలాంటి ఆచారాలు ఉన్నాయి?
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఖార్సీ గ్రామంలో దౌలత్ సింగ్ చౌహాన్ కుటుంబంలో ఇటీవల ఐదుగురు కుమారులు, ఒక కుమార్తెకు ఒకే వేదికపై వివాహాలు జరిగాయి. దౌలత్ సింగ్ చౌహాన్ కుటుంబంలో నరేంద్ర, ప్రీతమ్, రాహుల్, అమిత్, ప్రదీప్ అనే ఐదుగురు కుమారులు, రాధికా అనే కుమార్తెకు ఒకే సమయంలో వివాహాలు జరగడంతో జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇలా ఒకేసారి వివాహం చేయడాన్ని జోజోడా వివాహ పద్దతి అని అంటారు.
‘జోజోడా’ సంప్రదాయంలో మరో విశేషం ఏమిటంటే, సాధారణంగా ఇతర ప్రాంతాల్లో వరుడు వధువు ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఇక్కడ మాత్రం వధువులే ఊరేగింపుగా వరుడి ఇంటికి వస్తారు. సంప్రదాయ వాద్యాలు, నృత్యాలతో జరిగే ఈ ఊరేగింపు స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ విధానం ద్వారా వధువు కుటుంబంపై ఉండే ఒత్తిడి కూడా కొంత మేర తగ్గుతుంది. వీరి పెళ్లి కార్యక్రమాలు కూడా చాలా సాదాసీదాగా, సంప్రదాయపూర్వకంగా జరుగుతాయి. ఆడంబరాలు లేకుండా కుటుంబ సభ్యులు, గ్రామస్తుల మధ్యే వివాహాలు పూర్తి అవుతాయి. దీని వల్ల ఆర్థిక భారం తగ్గడమే కాకుండా సామాజిక బంధాలు మరింత బలపడతాయి.
ఆధునిక కాలంలో ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో జౌన్సార్ బావర్ ప్రాంతంలోని ‘జోజోడా’ వివాహ పద్ధతి ఒక ఆదర్శంగా నిలుస్తోంది. సంప్రదాయం, ఆర్థిక సమతుల్యత, కుటుంబ ఐక్యత ఈ మూడు అంశాలను సమన్వయం చేసిన ఈ పద్ధతి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.





