తెలంగాణ సచివాలయం వద్ద పోలీసు యూనిఫాంలో ప్రత్యక్షమై.. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విభాగంలో పనిచేస్తున్నానని తప్పుడు ప్రచారం చేసిన 31 ఏళ్ల వ్యక్తిని సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ కార్మికుడిగా పనిచేస్తున్న ఈ నిందితుడు, పోలీసు దుస్తుల్లో సచివాలయ ప్రాంగణంలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఏప్రిల్ 26 సాయంత్రం.. నిందితుడు పోలీసు యూనిఫాం ధరించి తన భార్యతో కలిసి సచివాలయానికి చేరుకున్నాడు. సచివాలయం ప్రాంగణంలో సెల్ఫీ తీసుకోవడానికి అనుమతి కోరగా.. అతను నిజమైన కానిస్టేబుల్ కావొచ్చు.. అని అనుకున్న భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించారు. అక్కడ అతను తీసిన రీల్ ను ఇన్ స్ట్రాగ్రామ్ ల పోస్టు చేయడందో అది వైరల్ అయింది.
ఆ వీడియోలో నిందితుడు తాను ముఖ్యమంత్రి భద్రతా బృందంలో సభ్యుడినని అబద్ధపు ప్రచారం చేశాడు. అంతేకాకుండా, ప్రజలు ఎవరైనా ముందస్తు అనుమతి లేకుండా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలనుకుంటే తనను సంప్రదించవచ్చని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనం సృష్టించింది.
నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ ఏ. సీతయ్య.. నిందితుడు గతంలో గోషామహల్ పోలీస్ స్టేడియం క్యాంటీన్‌లో పనిచేశాడని తెలిపారు. పోలీసు యూనిఫాం పట్ల ఉన్న మోజుతో, అంబర్‌పేట పోలీస్ లైన్స్ సమీపంలో ఒక విక్రేత వద్ద ఆ దుస్తులను కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడిని బుధవారం నాంపల్లిలో అరెస్టు చేసిన పోలీసులు, అతని వద్ద ఉన్న పోలీసు యూనిఫామ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS)ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు.





