Tuesday, August 11, 2026

ఛత్తీస్ గఢ్ లో ‘రేషన్ ఏటీఎం’.. మిషన్ ద్వారా బియ్యం పంపిణీ..

ప్రజా పంపిణీ వ్యవస్థలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సాంకేతికతను ప్రవేశపెట్టింది. ‘అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం’ పేరుతో రేషన్ బియ్యం ను మిషన్ ద్వారా పంపిణీ చేస్తోంది. ఈ మిషన్ తో రేషన్ కార్డుదారులు సంప్రదాయ రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా.. బ్యాంకు ఏటీఎం తరహాలో 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ తమకు కేటాయించిన బియ్యాన్ని పొందవచ్చు. ఈ కొత్త విధానం ద్వారా రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచడం, సమయం ఆదా చేయడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ మిషన్ ద్వారా రేషన్ ఎలా వస్తుందో.. చివరిలో వీడియో ద్వారా తెలుసుకోండి..

మూడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్
ప్రస్తుతం ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రంలోని రాయ్‌పూర్, దుర్గ్, బిలాస్‌పూర్ జిల్లాల్లో ప్రారంభించారు. ఈ మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్రెయిన్ ఏటీఎంల ద్వారా రేషన్ కార్డుదారులకు వారి నెలవారీ కోటాకు అనుగుణంగా బియ్యం పంపిణీ చేస్తారు. పైలట్ దశలో యంత్రాల పనితీరు, లబ్ధిదారుల స్పందన, సాంకేతిక సమస్యలను పరిశీలించిన తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంటుంది.

ఎలా పనిచేస్తుంది?
గ్రెయిన్ ఏటీఎం స్క్రీన్‌పై లబ్ధిదారుడు తన ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డు నంబర్‌ను నమోదు చేయాలి. అనంతరం వేలిముద్ర లేదా ఇతర బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా గుర్తింపును నిర్ధారిస్తారు. ధృవీకరణ పూర్తయిన తర్వాత సంబంధిత రేషన్ కార్డుకు కేటాయించిన బియ్యం పరిమాణాన్ని యంత్రం తనిఖీ చేసి, నిర్ణీత మొత్తాన్ని ఆటోమేటిక్‌గా బయటకు పంపిస్తుంది. లబ్ధిదారుడు యంత్రం కింద ఏర్పాటు చేసిన కంటైనర్ లేదా సంచిలో ఆ బియ్యాన్ని సేకరించుకోవచ్చు.

2,500 కిలోల నిల్వ సామర్థ్యం
అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం ఒక్కో యంత్రం సుమారు 2,500 కిలోగ్రాముల బియ్యాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యంతో రూపొందించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. యంత్రంలో బియ్యం లోడింగ్ ప్రక్రియ కూడా ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా నిర్వహించవచ్చు. బయోమెట్రిక్ ధృవీకరణ అనంతరం లబ్ధిదారుడికి కేటాయించిన పరిమాణాన్ని మాత్రమే పంపిణీ చేసేలా వ్యవస్థను రూపొందించారు.

క్యూలు, సమయ పరిమితులకు పరిష్కారం
ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రేషన్ దుకాణాలు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పనిచేస్తుండటంతో కూలీలు, ఉద్యోగులు, రోజువారీ పనులకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని వేళల్లో రేషన్ దుకాణానికి వెళ్లలేని వారు తమ డ్యూటీ పూర్తయిన తర్వాత రాత్రి సమయంలోనూ గ్రెయిన్ ఏటీఎం నుంచి బియ్యం తీసుకోవచ్చు. దీంతో రేషన్ దుకాణాల ముందు క్యూలు తగ్గడంతో పాటు లబ్ధిదారుల సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

వలస కార్మికులకూ ప్రయోజనం
ఈ సదుపాయం ఛత్తీస్‌గఢ్ రేషన్ కార్డుదారులకే పరిమితం కాదు. ‘వన్ నేషన్–వన్ రేషన్ కార్డు’ విధానం కింద ఇతర రాష్ట్రాలకు చెందిన రేషన్ కార్డుదారులు, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న వలస కార్మికులు కూడా బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా తమకు అర్హమైన ఆహార ధాన్యాన్ని పొందవచ్చు. వలస వెళ్లిన కుటుంబాలు తమ స్వస్థలంలోని రేషన్ దుకాణంపైనే ఆధారపడాల్సిన అవసరం లేకుండా, తాము నివసిస్తున్న ప్రాంతంలోనే రేషన్ పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News