Nellore Six Year Old Boy News: నిజం చెప్పడంలో పిల్లలు ఎంత నిష్కపటంగా ఉంటారో తెలిపే ఓ ఆసక్తికర ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. సాధారణ వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు ఓ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి తన వాహనాన్ని దాచిపెట్టిన విషయం అతని ఆరేళ్ల కుమారుడే పోలీసులకు చెప్పాడు. అంతేకాకుండా వాహనం ఎక్కడ ఉందో స్వయంగా పోలీసులకు చూపించాడు. బాలుడి అమాయకత్వం, నిజాయితీ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
నెల్లూరు జిల్లా అనంతసాగరంలో పోలీసులు సాధారణంగా నిర్వహించే వాహనాల తనిఖీల్లో భాగంగా ఇంటింటికీ వెళ్లి వాహనాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో సురేష్ అనే వ్యక్తి తన బండికి సరైన పత్రాలు లేవనే కారణంతో తన బండిని పోలీసులకు కనిపించకుండా ఓ సందులోని ఇంట్లో దాచిపెట్టాడు.
అయితే సురేష్ ఆరేళ్ల కుమారుడు మహేంద్ర తన తండ్రి గుట్టు రట్టు చేశాడు. పోలీసులు ఇంటి వద్దకు వచ్చి వాహనాల గురించి తనిఖీలు చేస్తుండగా.. బాలుడు వారికి దగ్గరగా వెళ్లి.. తన తండ్రి వాహనాన్ని ఎక్కడ దాచిపెట్టారో పోలీసులకు చెప్పాడు.అంతేకాకుండా.. ‘మీరు వస్తున్నారని మా నాన్న బండిని దాచిపెట్టారు’ అంటూ అమాయకంగా పోలీసులకు మహేంద్ర చెప్పడం ఆశ్యర్యానికి గురి చేసింది. అలాగే ఆ వాహనం ఉన్న ప్రదేశానికి వారిని స్వయంగా తీసుకెళ్లాడు. బాలుడి మాటలు విన్న అక్కడి వారు కూడా నవ్వుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసుల నుంచి వాహనాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించిన తండ్రి.. అదే సమయంలో తన కుమారుడి అమాయకత్వంతో విషయం బయటపడటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. పిల్లలకు విషయాలను దాచిపెట్టడం ఎంత కష్టమో ఈ ఘటన మరోసారి చూపించింది.





