కరీంనగర్, ఆగస్టు 11: అర్హులైన పేదలకు చేయూత పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కొత్తగా పింఛన్లకు అర్హత పొందే వారిని శాచురేషన్ మోడ్‌లో గుర్తించి, వారం రోజుల్లో అర్హులందరినీ గుర్తించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి గ్రామము ప్రతి వార్డు వైజ్ గా ఈ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో డి ఆర్డిఓ, జిల్లా సంక్షేమ శాఖ, మెప్మా, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ చిత్రా మిశ్రా చేయూత పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. గ్రామం, వార్డు వారీగా ముందుగా అర్హులను గుర్తించి, వారితో దరఖాస్తులు చేయించే విధానం.. చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన పేదలందరికీ అందేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నందున ప్రతి గ్రామం, ప్రతి వార్డు నుంచి అర్హులు దరఖాస్తు చేసుకునేలా విస్తృతంగా చైతన్యం కల్పించాలని ఆదేశించారు.
తొలి దశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ఆయా వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరినీ గుర్తించాలని తెలిపారు.
ఇంటింటి సర్వేతో అర్హుల గుర్తింపు
గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఇతర సిబ్బంది సహకారంతో విస్తృతంగా సర్వే నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఇతర పింఛన్లకు అర్హులైన వారిని గుర్తించి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
ఒక్క అర్హుడి కేసు కూడా మిస్ కాకుండా అధికారులు ఈ ప్రక్రియను ఒక సవాలుగా తీసుకోవాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కొత్తగా ఎంతమంది పింఛన్లకు అర్హులవుతారో కార్యాచరణ ప్రణాళిక ప్రకారం గుర్తించి, వారి నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు.
ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి .
ఒంటరి మహిళలు తమ జనన ధ్రువపత్రం, ఎస్సెస్సీ మెమో, ఓటరు గుర్తింపు కార్డు (EPIC) వంటి అందుబాటులో ఉన్న పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు అవగాహన కల్పించాలనీ, అవసరమైన సందర్భాల్లో స్థానిక విచారణ, సంబంధిత ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయించాలని సూచించారు. వితంతు మహిళలు తమ భర్త మరణ ధ్రువపత్రాన్ని అందుబాటులో ఉంచుకోవాలని, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ సిద్ధంగా ఉంచుకుని చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేలా అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి
కరీంనగర్ నగరపాలక సంస్థతోపాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రక్రియను మరింత సవాలుగా తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. కరీంనగర్లో కార్పొరేటర్లు, ఇతర మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో మున్సిపల్ అధికారులు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
గ్రామాల్లో అంగన్వాడి కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళల సహకారం తీసుకుని అర్హుల గుర్తింపు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, సంక్షేమ శాఖ, మెప్మా, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
అర్హుల గుర్తింపు నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ డేటా నమోదు, క్షేత్రస్థాయి పరిశీలన, తుది జాబితా తయారీ వరకు ఎక్కడా తప్పిదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అర్హులను మాత్రం మిస్ చేయవద్దని మరోసారి సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఆర్డీవో గీత, మెప్మా పీడీ స్వరూపారాణి, డీపీవో జగదీశ్వర్‌తో పాటు మున్సిపల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.





