Friday, August 7, 2026

The Strange Well: ఈ బావిలో అలలు.. కలెక్టర్ ఆదేశాలు..

The Strange Well:గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఓ బావి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ బావిలో గత ఐదు రోజులుగా సముద్ర అలలను తలపించేలా నీరు నిరంతరం కదులుతూ అలలు, తరంగాలు ఏర్పడుతున్నాయి. ఈ దృశ్యం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురవుతుండగా, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వందలాది మంది అక్కడికి చేరుకుని ఈ వింతను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. అసలేం జరిగిందంటే?

బావి యజమాని ప్రాంజీవన్ సదారియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 2న తన వ్యవసాయ పొలానికి వెళ్లినప్పుడు బావిలోని నీరు అసాధారణంగా అలలతో ఉప్పొంగుతూ బయటకు పొర్లిపోతున్నట్లు గమనించారు. సాధారణంగా గాలి లేకుండా బావిలో నీరు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ బావిలో మాత్రం ఎవరూ రాళ్లు వేయకపోయినా, గాలి ప్రభావం లేకపోయినా నీరు నిరంతరం కదులుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ బావిని కేవలం మూడు నెలల క్రితమే తవ్వినట్లు యజమాని తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. వీడియోల్లో బావి మొత్తం నీరు సముద్రపు అలల్లా ఒక వైపు నుంచి మరో వైపుకు ఊగుతూ కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో నీరు బావి అంచుల వరకు చేరి బయటకు పొర్లిపోతున్నట్లు కూడా కనిపించింది. దీంతో ఈ ఘటనను ప్రత్యక్షంగా చూడాలనే ఆసక్తితో పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు.

ఈ ఘటనపై భూగర్భ శాస్త్ర నిపుణులు ప్రాథమికంగా ఒక శాస్త్రీయ వివరణను సూచిస్తున్నారు. ఇటీవల గుజరాత్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దీంతో భూమి అడుగున ఉన్న రాళ్ల మధ్య ఖాళీల్లో చిక్కుకున్న గాలి అధిక ఒత్తిడితో బయటకు వస్తోంది. ఆ గాలి నీటిని నిరంతరం కదిలిస్తూ అలలను సృష్టిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.

భూగర్భ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో భూమి అడుగున సున్నపురాయి, అగ్నిపర్వత శిలలు లేదా ఇతర రాతి పొరల మధ్య పెద్ద ఖాళీలు ఏర్పడి ఉంటాయి. భారీ వర్షాల సమయంలో ఈ ఖాళీలు నీటితో నిండిపోవడంతో గాలి బయటకు నెట్టబడుతుంది. ఆ సమయంలో బావిలో నీరు అలల రూపంలో కదలడం సహజమే అయినప్పటికీ, ఐదు రోజుల పాటు నిరంతరం అలలు కొనసాగడం చాలా అరుదైన ఘటనగా నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ ఘటనపై మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖరే వెంటనే స్పందించారు. బావిలో ఐదు రోజులుగా కనిపిస్తున్న అలల విషయాన్ని గుజరాత్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనకు గల అసలు కారణాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు గాంధీనగర్ నుంచి భూగర్భ శాస్త్ర నిపుణుల బృందాన్ని ఘటన స్థలానికి పంపించాలని ఆదేశించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News