PM Kisan: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న PM-Kisan పథకం 20వ విడత నిధులు జూన్ 20(ఈరోజు) విడుదల కానున్నాయి. ఈ విడతలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా రైతులకు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సాగు ఖర్చుల్లో కొంత ఉపశమనం లభిస్తోంది.అయితే ఈసారి నిధుల జమ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధనను అమలు చేస్తోంది. eKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేసిన రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేసింది. eKYC పూర్తి చేయని రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ కాకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కేవైసీని ఎలా పూర్తి చేయాలంటే?
రైతులు ఇప్పటికీ eKYC చేయించుకోకపోతే వెంటనే PM-Kisan అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. వెబ్‌సైట్‌లోని ‘e-KYC’ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అనంతరం ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని నమోదు చేసి ధృవీకరించాలి. దీంతో eKYC ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్లైన్లో OTP ద్వారా eKYC చేయలేని రైతులకు కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించింది. సమీపంలోని మీ సేవా కేంద్రాలు లేదా CSC (Common Service Centre)లను సందర్శించి బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా eKYC పూర్తి చేసుకోవచ్చు. వేలిముద్రల ఆధారంగా ధృవీకరణ జరిపి ప్రక్రియను పూర్తి చేస్తారు.

రైతులు తమ పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయా? గత విడతల డబ్బులు జమ అయ్యాయా? అనే వివరాలను కూడా PM-Kisan పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా, ఆధార్, మొబైల్ నంబర్ వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలకు నేరుగా నిధులు జమ చేసే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానాన్ని అమలు చేస్తున్నందున, ఆధార్, బ్యాంకు ఖాతా, eKYC వివరాలు సరిపోలకపోతే చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉంది. అందువల్ల అర్హులైన రైతులు వెంటనే eKYC పూర్తి చేసి PM-Kisan 20వ విడత నిధులను పొందాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.





