కరీంనగర్: నాయి బ్రాహ్మణులకు అట్రాసిటి చట్టం వర్తింపజేయాలని నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరాల వెంకటస్వామి ఆధ్వర్యంలో సంఘం నాయకులు రాష్ట్ర రవాణా శాఖ & బీసీసంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు గురువారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు వినతిలో పలు విషయాలు పేర్కొన్నారు. ఇటీవల కరీంనగర్లో న్యూ ప్రజా హెయిర్ స్టైల్స్ సెలూన్ నిర్వాహకుడు పగడాల రాము (50) పై కరీంనగర్ త్రీ టౌన్ ఎస్ఐ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి సెలూన్ లో ఉన్న సిసిటీవీ కెమెరాలో రికార్డు కావడంతో పాటు బాధితుడి ఫిర్యాదుమేరకు ఎస్ఐ చైతన్య చందర్ ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై స్థానిక నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలు పగడాల రాముకు మద్దతుగా ఆందోళన చేపట్టి అండగా నిలుస్తామన్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటి యాక్ట్ జీవో ఇవ్వాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వినతిపై సానుకూలంగా స్పందించి అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఈ వినతి పత్రం అందించిన వారిలో నాయిబ్రాహ్మణ సంఘం నాయకులు అవుదుర్తి విజయ్ కుమార్. శ్రీరాముల బాల సురేందర్. గర్షకుర్తి రాజు ఉన్నారు.





