Thursday, April 16, 2026

రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేలు.. ‘పీఎం రాహత్’ పథకం ఉద్దేశ్యమేంటి?

ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే వారిని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటామని భయం. కానీ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం అందించేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గోల్డెన్ అవర్’ (ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట)లో అత్యవసర వైద్యం అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ‘PM రాహత్’ పథకం కింద ₹1.5 లక్షల వరకు పూర్తిగా ఉచిత చికిత్స అందించనున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ రకమైన బాధితులకు సహాయం చేస్తే.. రూ.5వేలు ప్రోత్సాహకాన్ని అందించేవారు. ఈ ప్రోత్సాహకాన్ని ఇప్పుడు రూ.25 వేలకు పెంచారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

‘PM రాహత్’ ఈ పథకం ప్రకారం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రిలో చేరిన మొదటి గంటలో అత్యవసర చికిత్స అందించబడుతుంది. ఈ చికిత్సకు గరిష్టంగా ₹1.5 లక్షల వరకు ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. అంటే బాధితుడు లేదా కుటుంబ సభ్యులు డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఈ పథకం దేశవ్యాప్తంగా ఎంపానెల్ చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అమలవుతుంది. బాధితుడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లిన వెంటనే చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. ముందుగా డిపాజిట్ అడగకుండా, వెంటనే ప్రాణరక్షణ చర్యలు చేపట్టడం ఆసుపత్రుల బాధ్యతగా ఉంటుంది. అత్యవసర చికిత్స ఖర్చు ₹1.5 లక్షలను మించినా, కొన్ని రాష్ట్రాల్లో అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా భరించే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో ‘NTR వైద్యసేవ’ కింద మిగిలిన ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది.

ఈ పథకంలో “గుడ్ సమారిటన్” (సహాయం చేసే వ్యక్తి)లకు కూడా రక్షణ కల్పించబడింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చిన వారికి ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా, కొన్ని రాష్ట్రాల్లో వారికి నగదు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నారు.

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఈ నగదు ప్రోత్సాహకం రూ. 5వేలు ఉండేది. కానీ ఇప్పటి నుంచి రూ. 25 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. దీని వల్ల సాధారణ ప్రజలు కూడా ముందుకు వచ్చి బాధితులను రక్షించేందుకు ప్రోత్సాహం పొందుతారు. “గుడ్ సమారిటన్” భావనను బలపరచడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం.
అలాగే, ప్రమాద బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లిన వారిపై పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. చాలా మంది పోలీసు విచారణ భయంతో బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వెనుకాడుతుంటారు. ఈ భయాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేయనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News