Tuesday, August 18, 2026

బీసీ మహిళలకు ‘ఇందిరమ్మ కుట్టు మిషన్లు’.. ఇలా అప్లై చేయండి..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేసే లక్ష్యంతో మరో కీలక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగస్టు 13న డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను మొదటి దశలో పంపిణీ చేయనున్నారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ సుమారు రూ.12,000గా ఉంది. అంటే మొదటి దశలో ప్రభుత్వం అందిస్తున్న కుట్టు మిషన్ల మొత్తం విలువ సుమారు రూ.142.8 కోట్లుగా ఉంటుంది. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి కుట్టు మిషన్లను అందించనున్నారు.

ఎవరు అర్హులు?
18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల బీసీ నిరుద్యోగ మహిళలు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. అలాగే ఒక కుటుంబానికి ఒకే ఒక్క కుట్టు మిషన్ మాత్రమే మంజూరు చేస్తారు. కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న మహిళలకు, ముఖ్యంగా ఇప్పటికే టైలరింగ్‌లో అనుభవం లేదా నైపుణ్యం ఉన్నవారికి అవకాశం కల్పించనున్నారు.

దరఖాస్తులు ఎప్పటి నుంచి?
ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణ 2026 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది. అర్హత ఉన్న మహిళలు ఈ గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి అర్హులైన వారు ముందుగానే అప్లై చేసుకోవడం మంచిది.

ఎక్కడ దరఖాస్తు చేయాలి?
కుట్టు మిషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక OBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ tgobmms.cgg.gov.in. అనే వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తరువాత ఇక్కడ indiramma kuttu mission అనే అప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు వివరాలు అందించాలి. చివరగా సబ్మిట్ అని కొడితే సరిపపోతుంది. దరఖాస్తు సమయంలో వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు, కులం, ఆదాయం తదితర సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.

ఏ పత్రాలు అవసరం?
ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే సమయంలో కొన్ని ముఖ్యమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బీసీ కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో వివరాలు అవసరం. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, కులం, ఆదాయం తదితర సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి. పత్రాల్లో ఉన్న వివరాలకు, దరఖాస్తులో నమోదు చేసే వివరాలకు తేడాలు ఉండకుండా చూసుకోవాలి. ఏదైనా తప్పు సమాచారం లేదా తప్పుడు పత్రాలు సమర్పిస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్
దరఖాస్తును పూర్తిగా నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. దరఖాస్తు విజయవంతంగా సమర్పించిన అనంతరం అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ లభిస్తుంది. ఈ నంబర్‌ను తప్పకుండా భద్రపరుచుకోవాలి. భవిష్యత్తులో దరఖాస్తు స్టేటస్‌ను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

లబ్ధిదారుల ఎంపిక ఎలా?
దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, ఆదాయ పరిమితి, వయస్సు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన ప్రాధాన్యత వర్గాలకు చెందిన మహిళలకు ఎంపికలో ప్రాధాన్యం దక్కనుంది. నియోజకవర్గానికి నిర్దేశించిన 1,000 మంది పరిమితికి అనుగుణంగా తుది జాబితాను రూపొందించనున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News