Priest performs puja for Rains: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బీచుపల్లి వద్ద ఆదివారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కృష్ణా నది పుష్కర ఘాట్ సమీపంలోకి హఠాత్తుగా ఒక మొసలి వచ్చి చేరడంతో అక్కడున్న భక్తులు, సందర్శకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నీటిలోనే ఉండాల్సిన మొసలి ఒక్కసారిగా ఒడ్డుకు రావడం, ఆపై సమీపంలోని ఒక భవనంలోకి వెళ్లడంతో అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు.
ఈ సమయంలో పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్‌శర్మ ప్రత్యేక చొరవ చూపారు. భయపడటానికి బదులుగా ఆయన నేరుగా ఆ మొసలి ముందే ఆసీనులై, శాస్త్రోక్తంగా మంత్రోచ్ఛారణలు చేస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మొసలిని వరుణ దేవుడి వాహనంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో పురోహితుడు అనిల్‌శర్మ పసుపు, కుంకుమ, సుగంధ పుష్పాలతో ఆ మొసలికి భక్తిశ్రద్ధలతో అభిషేకం చేశారు. రాష్టంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు పచ్చగా ఉండాలని, ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన వెల్లడించారు. భయంకరమైన క్రూరజంతువు ఎదుట పురోహితుడు ప్రశాంతంగా పూజలు చేయడం అక్కడి భక్తులను నిశ్చేష్టులను చేసింది.
పూజా కార్యక్రమం ముగిసిన అనంతరం, స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఎంతో సమయస్ఫూర్తితో మొసలిని సురక్షితంగా బంధించారు. దానికి ఎలాంటి హాని కలగకుండా తిరిగి నదిలోని సురక్షిత ప్రాంతంలోకి విడుదల చేయడంతో భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పురోహితుడి ధైర్యం, ఆపై ఫారెస్ట్ అధికారుల సత్వర స్పందనతో ఈ వింత ఘటన ఎలాంటి ప్రమాదం లేకుండా ముగిసింది.
వర్షాలు కురవాలని.. మొసలికి పూజలు
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 10, 2026
గద్వాల జిల్లాలోని బీచుపల్లిలో వెలుగు చూసిన ఘటన
ఓ మొసలి కృష్ణానది ఒడ్డుకు కొట్టుకురాగా.. తాళ్ల సాయంతో బయటకు తెచ్చిన జాలర్లు
అనంతరం మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించి.. పూజలు చేయాలని నిర్ణయం
దీంతో వర్షాలు సమృద్ధిగా కురవాలని మొసలికి పూజలు చేసిన… pic.twitter.com/DKOiZFunGG





