Cheyutha Pinchan:తెలంగాణలో చేయూత పింఛన్ల పథకం కింద కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్తగా అర్హత పొందిన వారి నుంచి పింఛన్ దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత పింఛన్ వస్తుందంటే?
చేయూత పింఛన్ కోసం వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులు, డయాలసిస్ చేయించుకుంటున్న వారు తదితర వర్గాలు దరఖాస్తు చేసుకోవాచ్చు. సంబంధిత అర్హతలు, ధ్రువపత్రాలు, ప్రభుత్వ పరిశీలన వంటి ప్రక్రియలు పూర్తయ్యాకే పింఛన్ మంజూరు అవుతుంది.
వితంతువులకు..
భర్తను కోల్పోయిన మహిళలు వితంతువు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 ఏళ్ల వయసు నిండిన వారు అర్హులుగా పేర్కొంటున్నారు. దరఖాస్తు సమయంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రం వంటి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అర్హత ఉన్న వితంతువులకు నెలకు రూ.2,016 పింఛన్ అందుతుంది.
ఒంటరి మహిళలకు..
కుటుంబ పరిస్థితుల కారణంగా భర్త నుంచి విడిపోయి జీవిస్తున్న మహిళలకు ఒంటరి మహిళల కేటగిరీలో పింఛన్ అందించే నిబంధనలు ఉన్నాయి. 18 ఏళ్లకు పైబడిన వయసు ఉండి, భర్త వదిలివేసిన మహిళలు అర్హత పొందవచ్చు. అలాగే 30 ఏళ్లకు పైబడిన అవివాహిత మహిళలు కూడా నిర్దేశిత నిబంధనల ప్రకారం ఈ పింఛన్‌కు అర్హులుగా పేర్కొంటున్నారు. ఈ కేటగిరీలో అర్హులైన వారికి నెలకు రూ.2,016 పింఛన్ లభిస్తుంది.
దివ్యాంగులకు..
దివ్యాంగుల పింఛన్ విషయంలో వయసుతో సంబంధం లేకుండా అర్హత కల్పిస్తున్నారు. సదరం ధ్రువీకరణ/అంచనా ప్రకారం 40 శాతానికి మించి వైకల్యం ఉన్నవారు దివ్యాంగుల పింఛన్‌కు అర్హులవుతారు. అర్హత పొందిన దివ్యాంగులకు ఇతర కేటగిరీల కంటే ఎక్కువగా నెలకు రూ.4,016 పింఛన్ అందుతుంది.
కల్లుగీత కార్మికులకు..
కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవించే అర్హులైన కార్మికులకు కూడా చేయూత పింఛన్ కింద ఆర్థిక సహాయం అందుతోంది. ఈ కేటగిరీలో అర్హత పొందిన వారికి నెలకు రూ.2,016 పింఛన్ అందుతుంది. వృత్తికి సంబంధించిన అర్హతలను అధికారులు పరిశీలించిన అనంతరం పింఛన్ మంజూరు చేస్తారు.
చేనేత కార్మికులకు..
చేనేత వృత్తిపై ఆధారపడి జీవించే అర్హులైన కార్మికులకు కూడా చేయూత పింఛన్ అందుతుంది. చేనేత రంగంలో పనిచేసే అర్హులైన వారికి నెలకు రూ.2,016 చొప్పున పింఛన్ అందించే నిబంధన ఉంది. ఇందుకు సంబంధించిన వృత్తి, ఆదాయం, ఇతర అర్హతలను అధికారులు పరిశీలిస్తారు.
బోదకాలు, డయాలసిస్ బాధితులకు..
బోదకాలు బాధితులు, డయాలసిస్ చేయించుకుంటున్న బాధితులకు కూడా చేయూత పథకం కింద పింఛన్ అందిస్తున్నారు. ఈ వర్గాలకు అర్హత ఉన్న వారికి నెలకు రూ.2,016 చొప్పున పింఛన్ లభిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక చికిత్స అవసరమయ్యే వారికి ఈ ఆర్థిక సహాయం కుటుంబాలపై ఆర్థిక భారాన్ని కొంత తగ్గించడంలో ఉపయోగపడుతుంది.





