భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ ఆచార, వ్యవహారాలు ప్రాంతాల వారీగా భిన్నంగా ఉంటాయి. దైవ పూజల్లో భాగంగా కొందరు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీటిని పూర్వీకులు మొదలు పెట్టగా.. వారి వారసులు దీనిని కొనసాగిస్తున్నారు.అయితే కర్ణాటక రాష్ట్రంలో దుర్గా పరమేశ్వరి అమ్మవారిని సేవించే క్రమంలో ఇక్కడ ‘అగ్నికేళి ’నిర్వహిస్తారు. అంటే చేతులో నిప్పుకట్టెలను పట్టుకొని ఆడుతారు. వింతగా ఉండే ఈ ఆచారాన్ని ఇటీవల నిర్వహించారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో కటీల్ దుర్గాపరమేశ్వరి ఆలయం జరిగే జాతర ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ప్రతీ ఏడాది ఏప్రిల్ నెలలో ఇక్కడ నిర్వహించే దుర్గాపరమేశ్వరి ఆలయం వార్షికోత్సవంలో భాగంగా ‘తూటెధార’ అనే ఆచారాన్ని నిర్వహిస్తారు. ఈ ఆచారంలో భాగంగా చేతులతో నిప్పు కర్రలు పట్టుకొని ‘అగ్నికేళి’ అనే వేడుకను నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవాన్ని చూస్తే నిప్పులతో సావాసం చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ఇది భక్తుల ఉత్సాహం, ధైర్యాన్ని ప్రతిబింబించింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం స్థానిక సంస్కృతి, భక్తి భావానికి చిహ్నంగా నిలుస్తోంది.
ఈ వేడుకలో భాగంగా భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి, మండుతున్న కొబ్బరి మట్టలను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. అగ్నిజ్వాలల మధ్య జరిగే ఈ తూటెదర పోరాటం చూడటానికి భయంకరంగా కనిపించినా, పాల్గొనే వారికి ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తారు. దేవికి తమ భక్తిని చూపించేందుకు ఈ విధంగా త్యాగం చేస్తామని వారు చెబుతారు.

ఈ క్రీడను చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివస్తూ ఉంటారు. స్థానికులు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అగ్నిచిమ్మే దృశ్యాలు, ఉత్సాహంగా నినాదాలు చేస్తూ పాల్గొనే భక్తులు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరుకు 25 కిలోమీటర్ల దూరంలో నందని అనే నది మధ్యలో కటీల్ అనే ఆలయం ఉంది. భూమి మధ్యలో ఉన్నట్లు ఇది కనిపిస్తుంది. అందుకే దీనిని కటీల్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ నిర్వహించే అగ్నికేళిలో అత్తూరు, కోడత్తూరు అనే గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొంటారు. వీరు పంచెలు కట్టుకొని మండుతున్న కట్టెలను చేతిలో పట్టుకుంటారు. వీటిని ఒకరిపై ఒకరు విసురుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ క్రీడ జరుగుతుంది. అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి దుర్గాదేవి భ్రమరాంభిక రూపంలో కనిపించిందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించడానికి ఈ అగ్నికేళిని ఆడుతారని స్థానికులు చెబుతున్నారు.
అయితే, ఈ తూటెదర వేడుకలపై భద్రతా అంశాలు కూడా చర్చకు వస్తుంటాయి. మండుతున్న మట్టలను విసరడం వల్ల గాయాల ప్రమాదం ఉన్నప్పటికీ, నిర్వాహకులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ, ప్రాణాలకు తెగించి చేసే ఈ సంప్రదాయం పట్ల కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచిత్రమేంటంటే ఈ క్రీడలో పాల్గొన్న వారికి ఇప్పటికీ ఎలాంటి అపాయం జరగలేదు. అంతేకాకుండా ఇందులో ఒక భక్తుడు 5 సార్లు మాత్రమే ఎదుటివారిపై కర్రలు విసరాలి. ఒకవేళ ఎవరికైనా మంటలు తగిలితే సమీపంలోని నందిని నది జలాలను చల్లుతారు.
ఇటీవల ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కొందరు దీనిని ధైర్యానికి ప్రతీకగా ప్రశంసిస్తుండగా, మరికొందరు భద్రతా కారణాల దృష్ట్యా ఇలాంటి సంప్రదాయాలను పునఃపరిశీలించాలని సూచిస్తున్నారు. మొత్తానికి, కటీలు దుర్గాపరమేశ్వరి జాతరలోని తూటెదర వేడుకలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాయి.





