తెలంగాణలో ‘రైతు భరోసా’ గురించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతు బంధు’ను కొనసాగిస్తామని, అయితే అంతకు మించి ఈ పథకం ద్వారా ప్రయోజనాలు కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు గత ఎన్నికల్లో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత క్రాప్ సమయంలో పాత రైతుబంధు నే రైతులకు అందించారు. ఆ తరువాత కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో భాగంగా ‘రైతు భరోసా’ను అమలు చేస్తామని, అయితే ఇందులో ఉన్న లోపాలను సరిచేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా గ్రామగ్రామాన రైతు సదస్సులు నిర్వహిస్తున్నారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఎవరెవరికీ రైతు భరోసా ఇవ్వాలనేదానిపై స్పష్టత ఇవ్వనున్నట్లు మంత్రులు తెలిపారు.
అయితే వానాకాలం సీజన్ రైతు భరోసా లేదా రైతు బంధు రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రకటించిన రుణమాఫీని అమలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.1.50 లక్షల వరకు మాఫీ చేసిన ప్రభుత్వం ఆగస్టు 15న రూ.2 లక్షలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలో ఉంది? అనే చర్చలు సాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ను బీడుభూములకు కూడా అందించారని,కొన్ని ప్రాంతాల్లో ప్లాట్లు కూడా ఈ పథకంలో చేర్చారని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ఇందులో భాగంగా ఈ పతకాన్ని ప్రక్షాళన చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రైతు భరోసాని అందిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ప్రస్తుతం కొన్ని రోజుల పాటు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఆ తరువాత సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా పై నిర్ణయం తీసుకునేందుకు కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో వచ్చే డిసెంబర్ వానాకాలం క్రాప్ వరకు రైతు భరోసాపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఆ తరువాత వచ్చే క్రాఫ్ సమయంలోనే రైతు భరోసాపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు విధి విధానాలు పూర్తయితే యేసంగి పంట ప్రారంభంలోనే మొత్తం ఒకేసారి ‘రైతు భరోసా’ అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఏడాదిలో ఎకరానికి రూ. 10వేల అందించింది. కాంగ్రెస్ ఏడాదికి రూ.15 వేలు రైతు భరోసా అందిస్తానని తెలిపింది. ప్రతీ క్రాఫ్ కు రూ.7500 అందించే అవకాశం ఉంది. కానీ ఈసారి రైతు భరోసాపై స్పష్టత వచ్చాక ఒకేసారి రూ.15 వేలను వచ్చే క్రాప్ ప్రారంభంలోనే చెల్లించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అదే నిర్ణయం తీసుకుంటే రైతులకు లాభపడే అవకాశం ఉంది.