కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దక్షిణాన విస్తరించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో అధికారంలో రావడానికి శత విధాలుగా ప్రయత్నిస్తోంది. అయితే గతంలో కంటే ప్రస్తుతం బిజెపి తెలంగాణలో పుంజుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లతో పాటు.. పార్లమెంటులోనూ 8 సీట్లను కైవసం చేసుకొని మిగతా పార్టీలకు గట్టి పోటీని ఇచ్చింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో గెలుపొంది పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ పార్టీ నాయకులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ పార్టీకి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉగాది కానుకగా కొత్త అధ్యక్షుడివి పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ బిజెపికి అధ్యక్షుడు ఎవరా..? అని ఆ పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా పేర్లు బయటికి వచ్చాయి. తెలంగాణ బిజెపికి బీసీ అధ్యక్షుడిని నియమించాలని భావిస్తున్న తరుణంలో ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపించింది. కానీ ఆ తర్వాత మరోసారి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటారని చర్చించారు. కానీ తాను అధ్యక్ష రేసులో లేనని బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో అధిష్టానం తీవ్రంగా ఆలోచించి కొందరి పేర్లను పరిశీలనలో పెట్టింది.
వీరిలో ఈటల రాజేందర్ తో పాటు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు కూడా వినిపిస్తోంది. అయితే మరికొందరు బిజెపి నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నేరుగా అమిత్ షా వంటి ప్రముఖులను కలుస్తూ వారి దృష్టిలో పడుతున్నారు. కానీ అధిష్టానం మాత్రం సంఘ్ పరివార్ మద్దతుతో కొందరి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వచ్చే ఉగాది సందర్భంగా బిజెపికి కొత్త అధ్యక్షుడు వస్తారని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రస్తుతం బిజెపికి నియమించే అధ్యక్షుడు కీలకంగా మారనున్నారు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తరుణంలో కొత్త అధ్యక్షుడు మరింతగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల తమ అధ్యక్షుడు ఎవరు అని ఆ పార్టీ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.