Saturday, December 6, 2025

పెళ్లయిన కొత్త జంటకు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు?

పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లి చేసుకున్న వారు 100 ఏళ్లపాటు కలకాలం జీవించాలని బంధుమిత్రులు, స్నేహితులు, మంత్రోచ్ఛరణల మధ్య వేడుకను వైభవంగా నిర్వహిస్తారు. వివాహం చేసే సమయంలో ఎన్నో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవితంలో పెళ్లి అనేది ప్రధాన ఘట్టం. ఈ కార్యక్రమంలో దేవతలు కూడా ఉంటారని.. వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే వధువు మెడలో వరుడు తాళి కట్టిన తర్వాత జరిగే ప్రధాన కార్యక్రమం అరుంధతి నక్షత్రం చూడడం. ఉన్నవారు.. లేనివారు అని కాకుండా ప్రతి పెళ్లిలో ఈ అరుంధతి నక్షత్రం చూసే కార్యక్రమం ఉంటుంది. చాలామంది అర్చకులు ఈ అరుంధతి నక్షత్రాన్ని చూపించగానే వధూవరులు ఇద్దరు కలిసి చూస్తారు. కానీ అలా ఎందుకు చూపిస్తారు? అని కొంతమందికి మాత్రమే సందేహం వచ్చి ఉంటుంది. ఇలా చూపించడానికి పెద్ద కారణమే ఉంది. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

అరుంధతి పేరు వెనుక ఒక పురాణ గాధ ఉంది. బ్రహ్మదేవుడు సంధ్యాదేవి నీ సృష్టిస్తాడు. ఈమె తనకు ఉపదేశం చేసే బ్రహ్మచారి కోసం వెతుకుతూ ఉంటుంది. వశిష్ట మహాముని తనకు సరైన ఉపదేశం చేస్తాడని భావిస్తుంది. దీంతో సంధ్యాదేవి వశిష్ట మహా మునిని ఆశ్రయిస్తుంది. అయితే ఉపదేశం చేసేందుకు వశిష్ట మహాముని అంగీకరిస్తాడు. ఆ తర్వాత సంధ్యాదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తుంది. ఈ సమయంలో ఒక అందమైన స్త్రీ రూపం ఏర్పడుతుంది. ఆ స్రీ రూపమే అరుంధతి.

అయితే ఈ రూపం ఎంతో అందంగా ఉండడంతో వశిష్ట మహాముని ఇష్టపడతాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే వశిష్ట మహాముని తాను తిరిగి వచ్చేంతవరకు తన కమండలాన్ని చూస్తూ ఉండమని చెబుతాడు. కాబోయే భర్త మాటను నిలబెట్టాలని వశిష్ట మహాముని వచ్చేంతవరకు అరుంధతి ఆ కమండలాన్ని చూస్తూనే ఉంటుంది. కొందరు పండితులు, ఋషులు ఆమె చూపును మార్చాలని ప్రయత్నిస్తారు. కానీ తన దృష్టి మార్చుకోదు. చివరకు వశిష్ట మహాముని వెతికి తీసుకువచ్చి అరుంధతి ముందు నిలబెడతారు. దీంతో అరుంధతి తన దృష్టిని మరలుస్తుంది. ఆ తర్వాత మహా పతివ్రతగా మారి నక్షత్రమై ఆకాశంలో నిలిచిపోతుంది. ఎంతో పవిత్రత కలిగిన అరుంధతి నక్షత్రాన్ని చూపించడం వల్ల తమ జీవితం బాగుంటుందని పెళ్లయిన కొత్త జంటకు ఇలా చూపిస్తారు.

మరికొందరు పండితులు చెబుతున్న ప్రకారం అరుంధతి పక్కనే వశిష్ట మహాముని నక్షత్రం కూడా ఉంటుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం అరుంధతి నక్షత్రాన్ని ఆల్కోర్ అంటారు.. వశిష్ట నక్షత్రాన్ని మిజార్ అని చెబుతారు. ఈ రెండు నక్షత్రాలు ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయి. ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి. ఇలా భార్యాభర్తలు కూడా ఒకరికొకరు కలిసి ఉండాలని అరుంధతి, వశిష్ట నక్షత్రాలను చూపిస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News