‘యే పవన్ నహీ హై.. ‘ఆంధీ’ హై..’ (ఆయన పవనం కాదు.. తుఫాను) అని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనసేన అధినేత పవన్ ను ఉద్దేశించి అన్నాడు. ఈ వ్యాఖ్యలు చేయగానే పవన్ మోదీకి మనస్పూర్తిగా నమస్కరించాడు. అయితే వపన్ ను ఒక దేశ ప్రధాని ఇలా అనడానికి కారణాలు లేకపోలేదు. పవన్ అంటే ఒక వ్యక్తి కాదు.. తుఫానుల వ్యవహరించిన వ్యక్తి అన్నట్లుగానే వ్యవహరించాడు. అవమానాలు, చీదరింపులు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్న పవన్ మొత్తానికి తాను గెలవడమే కాకుండా ఆంధ్రదేశాన్ని కాపాడాడు అని జనసైనికులు కొనియాడుతున్నారు. ఇలా ఎందుకంటే?
సినిమాల్లో సక్సెస్ సాధించిన తరువాత పవన్ అన్న మెగస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టిన తరువాత యూత్ లీడర్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ప్రజారాజ్యం పార్టీ ఎక్కువ కాలం నిలవలేకపోయింది. కానీ పవన్ మనసులో మాత్రం రాజకీయాల్లోకి రావాలన్న కాంక్ష అలాగే ఉండిపోయింది. దీంతో 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఒక విధంగా పవన్ ప్రచారంతోనే టీడీపీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిందన్న ప్రచారం సాగింది. అయితే 2018లో ఆ పార్టీతో విభేదించి సొంతంగా ‘జనసేన’ ను స్థాపించాడు. 2019లో కమ్యూనిస్టు పార్టీల సహయంలో పోటీ చేసినా ఒకే ఒక్క సీటును గెలిపించుకున్నారు.
2019 ఎన్నికల్లో తను ఓడిపోవడంతో పాటు ఒక్క సీటు కూడా రాకపోతే ఏ పొలిటికల్ లీడర్ కైనా రాజకీయాలపై విరక్తి పుడుతుంది. అంతేకాకుండా మళ్లీ జనాల్లోకి వెళ్లాలని అనిపించదు. కానీ రెండు నెలల తరువాతనే పవన్ ప్రజల్లో కలిసిపోయారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ముందుగా రోడ్డు సమస్యలపై పోరాడి.. అధికార పార్టీతో రోడ్డు వేయించగలిగాడు. ఆ తరువాత ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వారి తరుపున పోరాడాడు.
ఇలా ఐదేళ్ల పాటు ప్రజా సమస్యలపై పోరాడిన పవన్ రాజకీయ విద్య నేర్చుకున్నాడు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యం అని నినదించాడు. కొందరు ఆయన ఇలా మాట్లాడడంపై హేళన చేశారు. కానీ అనుకున్న పనిని కచ్చితంగా చేయడం పవన్ నైజం. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి తెచ్చాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా వైసీపీని గద్దె దించాలన్న లక్ష్యంతో పనిచేశాడు.
ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్ట్ అయిన క్రమంలో ఆయనను జైలలో కలుసుకున్న తరువాత పవన్ రాజకీయ పంథా మార్చుకున్నారు. అప్పటి నుంచి రాజకీయ చాణక్యుడిగా వివిధ ప్రణాళికలు వేశాడు. అప్పటి వరకు బీజేపీ, టీడీపీలు కాస్త దూరంగానే ఉన్నాయి. కానీ వీరి మధ్యలో పవన్ చేరి మూడు పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చాడు.
ఇక సీట్ల పంపకం విషయంలో పవన్ ఏమాత్రం పేచి పెట్టలేదు. తనకు 21 సీట్లు కేటాయిస్తే ఏమాత్రం అసంతృప్తి చెందలేదు. ఎందుకంటే పవన్ లక్ష్యం వైపు మాత్రమే చూశాడు. అలాగే తన ప్రచారంలో ఎక్కవగా వ్యతిరేక ఓట్లు చీలకూడదు అన్న నినాదం బాగా పాతుకుపోయింది. దీంతో ప్రజలు పవన్ వ్యాఖ్యలను బాగా అర్థం చేసుకొని కూటమి పార్టీలకు ఓటు వేశారు. అందువల్లనే వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చారు. ఇంతకు మంచి ఎన్నో అవమానాలు పడ్డ పవన్ ను నరేంద్ర మోదీ ‘తుఫాను’ అనడం కరెక్టే అని అనిపిస్తోంది.