ఆషాఢ మానం అనగానే చాలా మందికి వివిధ అభిప్రాయాలు ఉంటాయి. కొత్తగా పెళ్లయిన వారు దూరంగా ఉండాలని, అత్తాకోడళ్లు మొహలు చూసుకోవద్దని, ఈ కాలంలో కాళ్లు, చేతులకు గోరింటాకు పెట్టుకోవాలని చెబుతూ ఉంటారు. అలాగే ఆషాఢ మాసంలో దేవుడు యోగ నిద్రలోకి వెళ్తారని, అందుకే ఈ సమయంలో శుభకార్యాలు చేసినా ఫలితం ఉండదని పేర్కొంటారు. మరి ఆషాఢ మాసం రాగానే బోనాల పండుగ ఎందుకు నిర్వహిస్తారు. పూజలు, వ్రతాలు లేని కాలంలో బోనాల పండుగ వల్ల అమ్మవారు ఆశీర్వదిస్తారా? పూర్తి వివరాల్లోకి వెళితే..
2024 ఏడాదిలో జూలై 6 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఆషాఢ మాసం ప్రారంభం కాగానే ముందుగా కొత్తగా పెళ్లయిన వారు దూరం ఉండాలని చెబుతున్నారు. ఇలా దూరంగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ సైంటిఫిక్ గా చెప్పాలంటే ఈ సమయంలో దంపతులు అన్యోన్యంగా ఉండి గర్భం దాల్చితే 9 నెలల వేసవి కాలం వస్తుంది. ఆ సమయంలో పురుడు పోసుకోవడం వల్ల అనేక అనారోగ్య కారణాలు ఉంటాయి. అందువల్ల దూరంగా ఉండాలని పూర్వకాలం పెద్దలు నిర్ణయించారు. మరోవైపు ఈ సమయంలో అత్తా కోడళ్ల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతాయని కొందరు అంటుంటారు.
ఆషాఢ మాసం రాగానే గోరింటాకు సందడి ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది ఊళ్లల్లో దొరికే గొరింటాకును తీసుకొచ్చి ఆడపడుచులంతా ఒక్కచోట కూర్చొని చేతులకు, కాళ్లకు గోరింటాకు వేసుకుంటారు. అయితే ఈ సమయం వర్షాకాలం. దీంతో వ్యాధులు, అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా గోరింటాకును వేసుకుంటారు. అలాగే గోరింటాకు వేడిని తగ్గిస్తుంది. ఇప్పటి వరకు వేసవి కాలంలో ఉన్నందన శరీరంలో ఎలాంటి మలినాలు ఉన్నా పోతాయని అంటుంటారు.
ఆషాఢ మాసం రాగానే తెలంగాణలో బోనాల ఉత్సవం ప్రారంభం అవుతుంది. జూలై 7న తొలి బోనం గోల్కోండ కోటలోని జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించనున్నారు. అయితే ఈ ఆషాఢ మాసంలో పూజలు, వ్రతాలు ఉండవు. కానీ బోనాలు ఎందుకు చేస్తారు? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు.
ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తారని అంటారు. అందువల్ల ఇంటికి వచ్చిన ఆడబిడ్డను సంతోష పర్చడానికి పుట్టింటి వారు ప్రేమానురాగాలతో బోనంతో నైవేద్యాన్ని సమర్పిస్తారు. అయితే పూర్వ కాలంలో ఈ పండుగ రోజుల దుష్ట శక్తులను పాలదోలడానికి దున్నపోతును బలి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కోళ్లు, మేకలు బలి ఇస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఒకప్పుడు హైదరాబాద్ లో ప్లేగు వ్యాధితో చాలా మంది మరణించారు. దీంతో శవాల కుప్పులు కనిపించాయి. దీంతో తమను కాపాడాలని గ్రామ దేవతను కోరి బోనాల పండుగను నిర్వహించారని చరిత్ర తెలుపుతోంది.